Nagaland: ప్రారంభమైన మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీలు!

  • బీజేపీదే గెలుపంటున్న ఎగ్జిట్ పోల్స్
  • గెలుపుపై ఎవరికి వారే ధీమా
  • ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశం 

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. త్రిపురలో గతనెల 18న ఎన్నికలు జరగ్గా, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27 న ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ హాల్స్ వద్ద కేంద్ర బలగాలను మోహరించినట్టు త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) శ్రీరామ్ తరణికాంత తెలిపారు. మూడు రాష్ట్రాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారే గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గాలి బలంగా వీస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని పేర్కొన్నాయి. మిగత రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాయి. మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ పాగా వేయగా ఈ ఎన్నికల ద్వారా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరించాలని బీజేపీ పట్టుదలతో ఉండగా, తమ పట్టును సడలించకూడదని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఉదయం పది గంటలకు తొలి ఫలితం విడుదల కానుండగా మధ్యాహ్నానికి గెలుపెవరిదనేది తేలిపోతుందని చెబుతున్నారు.

More Telugu News