divorce: 'ఆలస్యంగా నిద్రలేస్తుంది, వంట సరిగా చేయదు' అంటూ విడాకులు కోరిన భర్త... 'బుద్ధుందా?' అంటూ చీవాట్లు పెట్టిన కోర్టు!

  • ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంది
  • సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి కునుకు తీస్తుంది
  • రాత్రి 8:30 వరకు వంట మొదలు పెట్టదు.. అంటూ భర్త ఆరోపణలు 

 ఆలస్యంగా నిద్రలేస్తుందని, ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని భార్య నుంచి విడాకులిప్పించాలని బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తికి న్యాయస్థానం అక్షింతలు వేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో భార్య, తల్లిదండ్రులతో నివస్తున్న వ్యక్తి తన భార్య నుంచి విడాకులిప్పించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ లో తన భార్య ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తనకు, తన తల్లిదండ్రులకు వండిపెట్టడం లేదని, చేసిన వంట రుచికరంగా ఉండడం లేదని పేర్కొన్నాడు.

సాయంత్రం ఆరు గంటల తరువాత ఆఫీసు నుంచి ఇంటికి వస్తుందని, అలసటగా ఉందని కాసేపు నిద్రపోతుందని, మళ్లీ రాత్రి 8:30 గంటల వరకు వంట ప్రారంభించదని, వంట చేయదని, తాను ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్లు కూడా ఇవ్వదని ఆరోపించిన భర్త, తన భార్య నుంచి విడాకులిప్పించాలని కోరాడు.

ఆయన ఆరోపణలకు ఆయన తండ్రి కూడా వత్తాసు పలకడం విశేషం. దీంతో న్యాయస్థానం ఆమె వివరణ కోరింది. తన భర్త తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని, ఉదయం ఆఫీస్‌ కు వెళ్లే ముందే కుటుంబం మొత్తానికి వంట చేస్తానని చెప్పింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నానని న్యాయస్థానానికి వివరించింది. ఆమె వాదనతో ఇరుగుపొరుగులు కూడా ఏకీభవించారు.

దీంతో భర్తపై న్యాయస్థానం మండిపడింది. ఇంటి పనితో పాటు భార్య ఆఫీస్‌ కు వెళ్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. ఆమె ఆఫీస్‌ నుంచి వచ్చేటప్పుడే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువస్తోందని, ఎంత పని ఉన్నా కుటుంబసభ్యుల కోసం ఉదయం, సాయంత్రం వంట చేస్తోందని, అలాంటి భార్యను మంచి నీళ్లివ్వలేదని ఆరోపించడం సరికాదని సూచించింది. ఏ భర్త అయినా సరే, ప్రతిసారి భార్య నీళ్లివ్వాలని ఎదురుచూడడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి ఆరోపణలతో విడాకులు కోరడం సబబు కాదని ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది.

More Telugu News