rape: మాజీ మంత్రిపై రేప్ కేసు ఆరోపణలను వెనక్కి తీసుకున్న మహిళా కానిస్టేబుల్

  • సంవత్సరాల తరబడి మాజీ మంత్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న మహిళ
  • సీడీ కూడా సమర్పించిన బాధితురాలు
  • తాజాగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు చెప్పిన మహిళ
  • పోలీసుల బలవంతంతోనే అలా చెప్పాల్సి వచ్చిందని ఆరోపణ

పంజాబ్ మాజీ మంత్రి సచ్చా సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా కానిస్టేబుల్ వాటిని వెనక్కి తీసుకున్నారు. శిరోమణి అకాలీదళ్ నేత సచ్చా సింగ్ తనపై ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆమె ఆరోపణలు ఇటీవల పెను దుమారం సృష్టించాయి. ఈ కేసులో తొలుత చూపించిన వీడియోలో ఉన్నది తాను కానని, దానిని మార్ఫింగ్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విషయంలో పోలీసులే తనతో బలవంతంగా ఆరోపణలు చేయించారని పేర్కొన్నారు. రేప్ కేసు ఆరోపణలపై సచ్చాసింగ్‌ను గతేడాది సెప్టెంబరు 29న అరెస్ట్ చేశారు. గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికకు సరిగ్గా 11 రోజుల ముందు మహిళ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

బాధిత మహిళ గతంలో పోలీసులకిచ్చిన ఫిర్యాదులో సచ్చాసింగ్ తనపై 2009 నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా 20 నిమిషాల నిడివి ఉన్న ఓ సీడీని సమర్పించారు. అందులో మాజీమంత్రి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్టు ఉంది. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి తన ఆస్తులను కూడా ఆయన అమ్ముకున్నారని ఆరోపించారు.

కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన బాధిత మహిళ సచ్చా సింగ్‌పై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నారు. కోర్టుకు సమర్పించిన సీడీలో ఉన్నది తాను కాదని, అది మార్ఫింగ్ సీడీ అని గురుదాస్‌పూర్ సెషన్స్ జడ్జికి తెలియజేశారు. పోలీసుల ఒత్తిడితోనే సచ్చాసింగ్‌పై ఆరోపణలు చేశానని, ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. పోలీసులు తనతో తెల్లకాగితంపై సంతకం తీసుకుని తర్వాత వారికి ఇష్టం వచ్చినట్టుగా రాయించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది. కాగా, బెయిలు కోసం సచ్చాసింగ్ పంజాబ్- హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News