Hyderabad: మైనర్ కొడుకులకు బండ్లు ఇచ్చిన 55 మంది తండ్రులకు జైలు శిక్ష!

  • నెల రోజుల వ్యవధిలో 1,079 చార్జ్ షీట్లు
  • ఒకటి నుంచి రెండు రోజుల శిక్ష విధింపు
  • మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరమంటున్న పోలీసులు

కేవలం మందు కొట్టి బండి నడపటమే కాదు, అల్లారుముద్దుగా పెంచుకునే కొడుకు అడిగాడు కదా అని మైనారిటీ తీరకుండానే వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపుతున్న వారి బెండు తీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మైనర్లకు వాహనాలు ఇవ్వడాన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, ఎవరు చిక్కినా కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, వారి వాహనాలు స్వాధీనం చేసుకుని, కోర్టుల్లో కేసులు పెడుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో 1,079 చార్జ్ షీట్లు దాఖలు చేయగా, మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల జైలు శిక్షను విధించారు నాంపల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అల్తాఫ్ కే హుస్సేన్.

ఇదే సమయంలో టోలీచౌకీ పరిధిలో ఎలాంటి పత్రాలు, లైసెన్స్ లేకుండా వేగంగా వెళుతూ పట్టుబడిన మైనర్ కు ఒకరోజు జైలు శిక్ష కూడా పడింది. ఇలా మైనర్ కు జైలు శిక్ష పడటం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిది. అతడిని జువైనల్ హోమ్ కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడో కేటగిరీ నేరం... అంటే వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికి కూడా ముప్పు తెప్పించే నేరాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని, మైనర్ డ్రైవింగ్ ఇదే కోటా కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

More Telugu News