amala: నా జీవితాన్ని నాకు వదిలేయండి!: అమల భావోద్వేగపు పోస్ట్‌

  • శ్రీదేవి మృతిపై అసత్య వార్తలు వచ్చిన నేపథ్యంలో పోస్ట్‌
  • నాకెంత జుట్టు ఉందన్న విషయం గురించే పట్టించుకుంటారు 
  • కానీ, నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు
  • కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా చూపించగలుగుతాయా?

సినీనటి శ్రీదేవి మృతిపై భారతీయ మీడియాలో, సోష‌ల్ మీడియాలో రకరకాల కథనాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రముఖ సినీ న‌టి అమ‌ల కూడా ఈ విష‌యంపై స్పందించి, చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండని ఫేస్‌బుక్‌లో కోరారు. ఇక 'నా జీవితాన్ని నాకు వదిలేయండి. వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి. నిజం, లక్ష్యం వంటి అంశాల మధ్య బతికేందుకు అనుమతినివ్వండి' అంటూ భావోద్వేగపూరితంగా పోస్ట్ పెట్టారు.

నన్ను ఎందుకు అలసిపోయావని, ఎందుకు బరువు పెరిగావని అడగకుండా నన్ను ప్రశాంతంగా కాలం గడపనిస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. తన కంటి కింద నలుపు రీడింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం వల్ల వచ్చిందని, ముడతలు వయసును బట్టి వస్తాయని, సైజ్‌ జీరో లాంటివి గుర్తుచేయకుండా తనను ప్రశాంతంగా కోరుకున్న దుస్తులు వేసుకోనిస్తారా? అని ఆమె అడిగారు.

‘నాకెంత జుట్టు ఉందన్న విషయం గురించే పట్టించుకుంటారు కానీ, నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు. కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా చూపించగలుగుతాయా? నేను ఎలా వంట చేస్తాను? వంటి విషయాలు అడగకుండా నన్ను ప్రశాంతంగా అర్థవంతమైన విషయాలపై చర్చించనిస్తారా?' అని ఆమె ప్రశ్నించారు. మార్పు వచ్చేలా ఏదన్నా విభిన్నంగా చేయాలని తాను ఆలోచిస్తున్నట్లు, భౌతికంగా తాను వెళ్లిపోయేలోపు పూర్తి చేయని విషయాలు పూర్తిచేయాలనుకుంటానని చెప్పారు.

ప్రశాంతంగా తనను తన దారిలో నడవనిస్తారా? అని అమల ప్రశ్నించారు. తన జీవితంలో ఓ మిషన్‌ను పూర్తిచేయాలనుకుంటున్నానని, కానీ, ఇతరులు కలగజేసుకోవాలనుకున్నప్పుడు ఆ మిషన్‌ను పూర్తిచేయలేనని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్లు, టీఆర్పీ రేటింగ్స్‌, బాక్సాఫీస్‌ పిచ్చి నుంచి తనను విముక్తురాలిని చేస్తారా? అని ఆమె ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. 

More Telugu News