Sridevi: 'వాళ్ల ఇళ్లల్లో బాత్‌ టబ్‌లు ఉండవు'.. శ్రీదేవి మృతిపై భారత మీడియాను ఎద్దేవా చేసిన దుబాయ్‌ మీడియా

  • ఊహాగానాలతో వార్తలు రాశారని ఖలీజ్‌ టైమ్స్ విమర్శలు 
  • భారతీయ మీడియా కథనాలను తప్పుబట్టిన వైనం
  • శ్రీదేవి మృతిపై సమాచారాన్ని వక్రీకరిస్తూ చూపించారని కథనం
  • భారతీయులకు బాత్‌ టబ్‌ల వాడకం గురించి తెలియదని విమర్శలు

సినీనటి శ్రీదేవి మృతిపై రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ, ఊహాగానాలతో వార్తలు రాస్తూ భారతీయ మీడియా ఎంతటి హడావుడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దుబాయ్‌కి చెందిన దిగ్గజ మీడియా ఖలీజ్‌ టైమ్స్ భారతీయ మీడియాపై తీవ్ర విమర్శలు చేసింది. శ్రీదేవిని భారతీయ మీడియానే హత్య చేసిందంటూ ఓ కథనం రాసింది. శ్రీదేవి మృతిపై అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని పేర్కొంది.

అంతేకాదు, భారత్‌లోని చాలామంది ఇళ్లల్లో బాత్‌ టబ్‌లు ఉండవని పేర్కొంటూ.. వాటి వాడకం గురించి వారికి తెలియదని ఎద్దేవా చేసింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి టబ్‌లో దిగి, అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తూ భారతీయ జర్నలిస్టులు విపరీతంగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతిపై సుబ్రమణ్య స్వామి, అమర్‌ సింగ్‌లు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ విమర్శించింది.
 
శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్త సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే, భారతీయ మీడియా మాత్రం సమాచారాన్ని వక్రీకరిస్తూ చూపిందని తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారని ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ భారత మీడియా ఎన్నో అసత్యాలను ప్రచురించిందని పేర్కొంది.  

More Telugu News