Mallikarjun Kharge: ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించిన మల్లికార్జున ఖర్గే

  • ఇది విపక్షాన్ని తప్పించే ఎత్తుగడగా ఆరోపణ
  • నాలుగేళ్ల పాటు ఆలస్యమెందుకని సూటిప్రశ్న
  • సమావేశానికి ప్రధానితో పాటు సీజేఐ, లోక్‌సభ స్పీకర్ హాజరవుతారు 

లోక్‌పాల్ ఎంపిక, నియామకంపై ఈ రోజు (మార్చ్ 1) ఏర్పాటు చేసిన సమావేశానికి 'ప్రత్యేక ఆహ్వానితుడు'గా హాజరుకావాలంటూ ప్రధాని మోదీ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తిరస్కరించారు. ఇందుకు కారణాలను ఆయన ఓ లేఖ ద్వారా ప్రధానికి తెలిపారు. లోక్‌పాల్ నియామకానికి ఉద్దేశించి నిర్వహించే సమావేశానికి తాను హాజరుకాలేనంటూ అందులో పేర్కొన్నారు.

లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ నుంచి విపక్షాన్ని మినహాయించే ఎత్తుగడ అయినందు వల్ల ఈ సమావేశానికి తాను హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు. 'ప్రత్యేక ఆహ్వానితుడుగా రావాలంటూ పంపిన ఆహ్వానం చూస్తుంటే మొత్తంగా లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ నుంచి విపక్షం స్వేచ్ఛా గొంతుకను మినహాయించడానికి తీసుకున్న ఓ సంఘటిత ప్రయత్నంగా అనిపిస్తోంది' అని ఖర్గే అభిప్రాయపడ్డారు. మరోవైపు మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే సర్కార్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు.

లోక్‌పాల్ నియామకాన్ని నాలుగేళ్ల పాటు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్ చట్టాన్ని ఆమోదించింది. దానిని జనవరి 16,2014 నుంచి అమలుచేసింది. అవినీతిపై పోరాటం అగదని పదే పదే ప్రకటనలు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం దాదాపు నాలుగేళ్లుగా లోక్‌పాల్‌ను నియమించరాదని భావించింది" అని ఖర్గే తన లేఖలో మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ సమావేశానికి ప్రధాని సహా భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా హాజరవుతారు.

More Telugu News