India: మరింతగా తగ్గిన బంగారం ధర!

  • ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతున్న ధరలు
  • అదే ప్రభావం భారత మార్కెట్లోనూ
  • వ్యాపారుల నుంచి మందగించిన కొనుగోళ్లు
  • వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధర

ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారం ధరలు తగ్గుతూ ఉండటంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా కనిపించింది. నిన్న బులియన్ మార్కెట్ లో రూ. 460 తగ్గిన 10 గ్రాముల బంగారం నేడు మరో రూ. 120కి పైగా తగ్గింది. అంతర్జాతీయ సంకేతాలతో స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గిందని, ఈ కారణంగానే ధరలు తగ్గుతున్నాయని బులియన్ పండితులు అభిప్రాయపడ్డారు.

 గడచిన నాలుగు సెషన్ లలో రూ. 500 వరకూ పెరిగిన బంగారం ధరలు, బుధవారం, గురువారాల్లో దిగివచ్చాయి. ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో నేడు బంగారం ధర రూ. 30,255 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ. 250 తగ్గిన కిలో వెండి ధర, నేడు మరో రూ. 240 తగ్గి రూ. 38,005 వద్ద కొనసాగుతోంది. కాగా, సింగపూర్ లో ఔన్సు బంగారం ధర 0.07 శాతం తగ్గి 1,316.80 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 0.37 శాతం తగ్గి 16.32 డాలర్లుగా నమోదైంది. ఇదిలావుండగా, క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర బ్యారల్ కు 1.61 శాతం తగ్గి రూ. 4,027 వద్ద, సహజవాయువు ధర 0.91 శాతం తగ్గి రూ. 174.30 వద్దా కొనసాగుతున్నాయి.

More Telugu News