Illegal Brothels: స్వచ్ఛందంగా చేసే వ్యభిచారం చట్టబద్ధమూ కాదు నేరమూ కాదు...!: కేంద్ర మంత్రి మేనకా గాంధీ

  • దేశంలో చట్టవిరుద్ధ వ్యభిచారుల గురించి తెలియదని వ్యాఖ్య
  • మనుషుల అక్రమ రవాణకి కొత్త చట్టంతో అడ్డుకట్ట
  • ఈ దిశగా ఎన్ఐఏ చట్టానికి సవరణ చేస్తున్నామని వెల్లడి

దేశ రాజధాని నగరంతో పాటు దేశంలో మరెక్కడైనా సరే చట్టవిరుద్ధమైన వ్యభిచారుల గురించి తనకు తెలియదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. ఎవరైనా విధిలిఖితమనుకుని స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా వ్యభిచార వృత్తిని ఎంచుకుంటే అది చట్టబద్ధమూ కాదు.. అలాగని నేరమూ కాదని 1956 నాటి మనుషుల అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం (ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్-ఐటీపీఏ) చెబుతోందని ఆమె తెలిపారు.

వ్యభిచార సమస్య పరిష్కారానికి తమ శాఖ త్వరలో తీసుకువస్తున్న కొత్త చట్టం తప్పకుండా పరిష్కారం చూపగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణా (నివారణ, సంరక్షణ, పునరావాసం) బిల్లు, 2018కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసిందని ఆమె చెప్పారు. మనుషుల అక్రమ రవాణాని అడ్డుకోవడంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ చట్టాల్లో ఈ బిల్లు ఒకటని ఆమె అన్నారు. ఇది గత చట్టాల్లోని లొసుగులకు చెక్ పెడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

 అంతేకాక చట్టవిరుద్ధ వ్యభిచారుల (బలవంతంగా ఈ మురికికూపంలోకి నెట్టబడిన వారిని ఉద్దేశించి)ను బాధిస్తున్న మనుషుల అక్రమ రవాణా వ్యవస్థను కూడా ఇది అడ్డుకోగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త బిల్లు ప్రకారం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) యాంటీ ట్రాఫికింగ్ బ్యూరో (ఏటీబీ)గా వ్యవహరిస్తుందని, దీని కోసమే ఎన్ఐఏ చట్టానికి ప్రత్యేకించి సవరణలు చేస్తున్నామని ఆమె చెప్పారు.

More Telugu News