Revanth Reddy: నందిగామలో రేవంత్ రెడ్డి ఘెరావ్...బైక్‌పై జారుకున్న వైనం..!

  • శిలాఫలకాన్ని ఢీకొట్టినందుకు గ్రామస్థుల ఆగ్రహం
  • వివరణ ఇవ్వాలంటూ పట్టు..వాహనాల ఘెరావ్
  • ఎంఎల్ఏ అరెస్టుకు డిమాండ్..జూపల్లికి ఫిర్యాదు

కొడంగల్ ఎంఎల్ఏ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి నందిగామలో చేదు అనుభవం ఎదురయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం, నందిగామ గ్రామంలో ఓ శిలాఫలకాన్ని ఢీకొట్టి వెళుతున్న ఆయనతో పాటు ఆయన అనుచరగణం వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే, నందిగామ గ్రామంలోని ఓ శిలాఫలకాన్ని రేవంత్ రెడ్డి వాహనం ఢీకొట్టింది. ఇలా చేసి వెళ్లిపోతే ఎలా? సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ గ్రామస్థులు నిలదీశారు. పరిస్థితి విషమించేటట్లు ఉందని గ్రహించిన ఎంఎల్ఏ అక్కడ నుంచి బైక్‌పై మెల్లగా జారుకున్నారు.

కోపం చల్లారని గ్రామస్థులు రహదారిని దిగ్బంధించారు. తక్షణమే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారు తమతో వాగ్వివాదానికి దిగారని పోలీసులు తెలిపారు. కొడంగల్ ఎంఎల్ఏకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్థులు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అధికార పార్టీకి  చెందిన పలువురు ప్రతినిధులకు ఈ విషయమై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

More Telugu News