India: 'మా దేశంలో భారత ఉగ్రవాదులు' అంటూ ఐదుగురిని అప్పగించిన యూఏఈ!

  • మూడు నెలల క్రితం అరెస్ట్
  • క్షుణ్ణంగా విచారించిన అరబ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ
  • ఐఎస్ మాడ్యూల్స్ గురించి వారికేమీ తెలియదు
  • రిక్రూట్ మెంట్, దాడుల ప్రణాళికలు రచించారు
  • వెల్లడించిన యూఏఈ అధికారులు

భారతీయులుగా ఉండి, తమ దేశానికి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఐదుగురిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారత్ కు తిప్పిపంపింది. అంతకుమందు వీరిని అదుపులోకి తీసుకున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీలు, వారిని విచారించిన అనంతరం అబూదాబి విమానాశ్రయానికి చేర్చి వారిని భారత్ కు పంపించి, ఆ విషయాన్ని ఇక్కడి అధికారులకు తెలిపారు.

వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన రేహాన్ అబీదితో పాటు ముంబైకి చెందిన ఇద్దరు, చెన్నైకి చెందిన ఇద్దరు ఉన్నారని, అందరూ 25 ఏళ్లలోపు వయసు వారేనని, ఒకరితో ఒకరికి పరిచయాలున్నాయని యూఏఈ నిఘా విభాగం వెల్లడించింది. ఇండియాకు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం చేసేందుకు మరింత మందిని చేర్చుకోవాలని వీరు ప్రణాళికలు రూపొందించారని, వీలైనన్ని ఎక్కువ దాడులు చేయాలని కూడా ప్లాన్లు వేశారని ఓ అధికారి తెలిపారు. వీరంతా తమ 18, 19 ఏళ్లలోనే హజ్ యాత్ర చేశారని, ప్రతి ఒక్కరికీ ముస్లిం మత నమ్మకాలపై అపార విశ్వాసం ఉందని తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై యూఏఈ, ఇండియా మధ్య జరిగిన ఐఎస్ అనుమానితుల తిరిగి పంపే ఒప్పంద కార్యక్రమంలో ఒకేసారి ఐదుగురిని డిపోర్ట్ చేయడం ఇదే తొలిసారి. గత సంవత్సరం దుబాయ్ నుంచి కొంతమంది కేరళ, తమిళనాడుకు చెందిన అనుమానిత ఉగ్రవాదులను దుబాయ్, అబూదాబీ, టర్కీ నుంచి తిప్పి పంపిన సంగతి తెలిసిందే. వారంతా పలు కేసుల్లో నిందితులుగా ఉండటంతో, ఇండియాలో కాలుపెట్టగానే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

"రేహాన్ అబిదీ, అతని స్నేహితులను ఉగ్రవాద కార్యకలాపాలపై విచారించాం. ఇండియాలోని ఐఎస్ మాడ్యూల్ గురించిన సమాచారం వారి వద్ద లభించలేదు. అయితే, కొత్త ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్ దాడుల ప్రణాళికలపై వారు చర్చించారని నిర్ధారించాం. మూడు నెలల క్రితం వారిని అరెస్ట్ చేశాం. ఆపై క్షుణ్ణంగా విచారించి, ఇప్పుడు భారత్ కు అప్పగిస్తున్నాం" అని యూఏఈ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News