Noida: ఆశ్చర్యం... నోయిడాలో మరీ ఇంత దారుణంగా తాగుతారా?

  • పది నెలల్లో రూ.775 కోట్ల విలువైన మద్యాన్ని ఊదేసిన వైనం
  • ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.930 కోట్లకు చేరుకునే అవకాశం
  • గతేడాదితో పోలిస్తే 11.3 శాతం పెరిగిన విక్రయాలు

నోయిడా వాసులను చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మద్యంపై వారికున్న ప్రీతి ఏపాటిదో తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం పదినెలల్లో ఏకంగా రూ.775 కోట్ల విలువైన మద్యాన్ని తాగేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే నోయిడాలోని గౌతమ్‌బుద్ధ్ నగర్‌లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అమ్మకాలు రూ. 930 కోట్లకు చేరుకుంటాయని చెబుతున్నారు. తాజా అమ్మకాలు గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 31 మధ్య జరిగినవి కావడం గమనార్హం.

హై ఎండ్ మద్యాన్ని తాగేవారు పెరగడంతోపాటు మద్యం తాగే మహిళల సంఖ్య కూడా పెరగడమే ఇందుకు కారణమని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి చివరి వరకు మొత్తం 66.71 లక్షల లీటర్ల మద్యాన్ని నోయిడా వాసులు గొంతులో పోసుకున్నారు. అమ్ముడుపోయిన వాటిలో 46.22 లక్షల బాటిళ్లు (750 ఎంఎల్) ఐఎంఎఫ్ఎల్ మద్యం కాగా, 123 లక్షల బీరు (650 ఎంఎల్) బాటిళ్లు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు 11.3 శాతం పెరిగినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News