Indrani Mukharjiya: కార్తీ కేసులో చిదంబరాన్ని కూడా ఇరికించిన ఇంద్రాణి ముఖర్జీ!

  • చెన్నై విమానాశ్రయంలో అరెస్టయిన కార్తీ
  • కార్తీ వ్యాపారానికి సహకరించాలని చిదంబరం కోరారు
  • ఈడీకి వాగ్మూలం ఇచ్చిన ఇంద్రాణి
  • ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంద్రాణి

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని నిన్న చెన్నై విమానాశ్రయంలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, ఈ కేసులో చిదంబరానికి కూడా చిక్కులు తప్పేట్టు లేవు. మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తుండగా, ఈ కేసులో ఆదినుంచి నానుతున్న ఇంద్రాణి ముఖర్జియా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కీలక సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది.

తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఆమెను ఇటీవల ఈడీ విచారించగా, తాను ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న వేళ, చిదంబరమే తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి వెల్లడించిందని సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.

దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తుండగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని చిదంబరం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News