Syria: శవాలదిబ్బగా మారిన సిరియా.. ఎటుచూసినా మృతదేహాలే.. మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న వైనం!

  • గౌటాలో రక్తపుటేరులు పారిస్తున్న సైన్యం
  • గాల్లో కలిసిపోతున్న పౌరుల ప్రాణాలు
  • మృతుల్లో చిన్నారులు, మహిళలే అధికం
  • ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని తుంగలో తొక్కిన రష్యా

సిరియాలోని గౌటా నగరం శవాల దిబ్బగా మారింది. గత ఎనిమిది రోజులుగా నగరంలో రక్తం ఏరులై పారుతోంది. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. వైమానిక దాడుల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 540 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఖ్య 700కు పైనేనని అంతర్జాతీయ సమాజం చెబుతోంది. మృతుల్లో ఎక్కువ మంది ముక్కుపచ్చలారని చిన్నారులు, మహిళలు ఉన్నారు.

నిజానికి ఇక్కడ నెల రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించింది. రష్యా-సిరియా బలగాలు దానిని తోసి రాజంటూ వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుత సిరియా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నిజానికి గౌటా గత ఐదేళ్లుగా ప్రభుత్వ బలగాల అధీనంలోనే ఉంది. అయితే రష్యా, సిరియా దాడులతో బిక్కచచ్చిపోయిన ఉగ్రవాదులు నగరంలోకి చొచ్చుకొచ్చి పౌరుల్లో కలిసిపోయారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. ఇక ఇక్కడి ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి చందాన తయారైంది. ఓ వైపు మిలిటెంట్లు, మరోవైపు ప్రభుత్వ బలగాల దాడులతో నలిగిపోతున్నారు.

ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ తీర్మానం చేసింది. దీనికి రష్యా అనుకూలంగా ఓటు వేసింది. అయితే విచిత్రంగా, ఇప్పుడు అదే రష్యా బాంబు దాడులతో విరుచుకుపడుతూ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గౌటాలో ప్రస్తుతం 3.93 లక్షల మంది చిక్కుకుపోయినట్టు అంచనా. ప్రస్తుతం గౌటాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు. పరిస్థితి మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందంటూ డాక్టర్ జాద్ అనే వైద్యుడు తెలిపారు.

More Telugu News