Ballari: నిరాహార దీక్ష బూని.. టాయిలెట్ కట్టించుకున్న బాలిక!

  • రెండు రోజుల పాటు నిరాహార దీక్ష
  • తల్లిదండ్రులు చెప్పినా అన్నం, నీరు ముట్టలేదు
  • ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న విద్యార్థిని

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో ఏడో తరగతి విద్యార్థిని టాయిలెట్ కోసం రెండు రోజుల పాటు నిరాహార దీక్షబూనింది. అన్నం, నీరు ముట్టలేదు. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. వివరాల్లోకెళితే...బళ్లారిలోని సిరుగుప్ప తాలూకా, తాలూర్ గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని హెచ్.మహంకాళి ఇటీవల గ్రామ పంచాయతీ నిర్వహించిన ఓ అవగాహనా కార్యక్రమంలో పాల్గొంది. ప్రతి ఇంటిలో సొంత టాయిలెట్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంది.

మహంకాళి కుటుంబానికి 2015-16 మధ్యకాలంలో ఓ టాయిలెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఫిబ్రవరి మొదటివారంలో పంచాయతీ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె....ఇంటికి తిరిగొచ్చాక అన్నం ముట్టలేదు. కనీసం నీళ్లు కూడా తాగలేదు. టాయిలెట్ కట్టిస్తామని చెబితేనే అన్నం తింటానంటూ ఆమె భీష్మించుకుని కూర్చుంది.

పరీక్షలు దగ్గరపడుతున్నాయి తల్లీ.. అన్నం తినమ్మా అని ఆమె తల్లిదండ్రులు బతిమిలాడినా అందుకు ఆమె ససేమిరా అంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ అధికారులు ఆమె దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు టాయిలెట్‌ కట్టించడంతో కథ సుఖాంతమయింది. ఆమె ధైర్యం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమెకు చదువు చెప్పే ఉపాధ్యాయులు ఆమె గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆమె ఇప్పుడు తన గ్రామానికి ఓ ఐకాన్‌గా మారిపోయింది.

More Telugu News