Sridevi: శ్రీదేవి తమిళనాడులో పుట్టినా.. అచ్చతెనుగు ఆడపడుచు!

  • శ్రీదేవి తల్లిది తిరుపతి
  • శ్రీదేవి తండ్రిది శివకాశిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం
  • శ్రీదేవి పుట్టింది శివకాశిలో

దివంగత సినీ నటి శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించినప్పటికీ పదహారణాల తెలుగు అమ్మాయేనని తెలుస్తోంది. శ్రీదేవి తల్లిదండ్రులిద్దరూ తెలుగు కుటుంబాలకు చెందిన వారు కావడం విశేషం. వారి వివరాల్లోకి వెళ్తే... శ్రీదేవి తాత కటారి వెంకటస్వామిరెడ్డిది తిరుపతి. ఆయన తిరుపతి-గ్యారపల్లి-జమ్మలమడుగు మధ్య బస్సులు నడిపేవారు. ఈ క్రమంలో జమ్మలమడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి కులాంతర (ఆమె బలిజ) వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించారు. ఆ దంపతులకు ఆరుగురు సంతానం.

పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం, ఆ తరువాత శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ, చిన్నాన్న సుబ్బరామయ్య, పిన్నిలు అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మలు. వీరంతా తిరుపతిలోని 93-టీకే వీధిలోని ఇంట్లో నివాసముండేవారు. పెద్దకుమారుడు బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించి, తనవెంట తమ్ముడు, చెల్లెళ్లందర్నీ చెన్నై తీసుకెళ్లిపోయారు.

ఆ తరువాత శ్రీదేవి తల్లి మినిహా మిగిలిన వారంతా ఉద్యోగాల్లో స్థిరపడగా, ఆమె మాత్రం సినిమాల్లో నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి సూర్యకళ అనే కుమార్తె జన్మించింది. అనంతరం రంగారావు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో రాజేశ్వరి ఒంటరిదైంది.

ఆ క్రమంలో శివకాశి తెలుగు కుటుంబానికి చెందిన, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక బిడ్డ తండ్రి అయ్యప్పన్‌ రెడ్డిని రాజేశ్వరి వివాహం చేసుకున్నారు. దీంతో తన కుమార్తె సూర్యకళను ఆమె తన తల్లిదండ్రులకు అప్పగించింది. వారి దాంపత్యానికి గుర్తుగా శ్రీదేవి, శ్రీలత పుట్టారు. శ్రీదేవి తండ్రి మరణానంతరం ఆయన కుమారుడే కుటుంబ బాధ్యతలు మోశాడు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందినా, ఆమె అన్న మాటను జవదాటేవారు కాదు. శ్రీలతకు మధురైకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ తో వివాహం జరిపించారు. శ్రీదేవి అక్క సూర్యకళను రాజేశ్వరమ్మ మేనత్త కుటుంబంలోని బంధువుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ సూర్యకళ కుమార్తే గులాబీ సినిమా హీరోయిన్‌ 'మహేశ్వరి'. అలా శ్రీదేవి తమిళనాడు శివకాశిలో జన్మించినప్పటికీ... అచ్చతెనుగు ఆడబడుచేనని తెలుస్తోంది. 

More Telugu News