Tamilnadu: శ్రీదేవి సినీ రంగ ప్రవేశానికి సిఫారసు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి!

  • తనతో పాటు కామరాజనాడార్ వద్దకు తీసుకెళ్లిన అయ్యప్పన్
  • శ్రీదేవిని చూడగానే సినిమాల్లో నటిస్తే బాగుంటుందని, కన్నదాసన్ కు సిఫారసు చేసిన నాడార్
  • చిన్నప్పదేవర్ ‘తునైవన్‌’ సినిమాలో బాలమురుగన్ వేషం వేసి అలరించిన బుల్లి శ్రీదేవి

దివంగత శ్రీదేవి సినీ రంగప్రవేశానికి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజ నాడార్ కారణమన్న విషయం వెలుగులోకి వచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే... శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌, ఆయన స్నేహితుడు బాలు నాయక్కర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు. శ్రీదేవికి నాలుగేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి కామరాజ నాడార్‌ వద్దకు వెళ్తూ ఆమెను కూడా తీసుకెళ్లారు. శ్రీదేవిని చూసిన ఆయన, ఈ బాలిక సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అయ్యప్పన్ కు సూచించారు.

అంతటితో ఆగకుండా.. నేరుగా తమిళ సినీ గేయ రచయిత కన్నదాసన్‌ కు కబురు చేసి, పాపను సినీ అవకాశాల కోసం సిఫారసు చేయమని కోరారు. దీంతో ఆయన బుల్లి శ్రీదేవిని నిర్మాత చిన్నప్పదేవర్‌ కు పరిచయం చేశారు. అప్పటికే ‘తునైవన్‌’ సినిమాలో బాల కుమారస్వామి (మురుగన్‌) పాత్ర కోసం అన్వేషిస్తున్న ఆయన, శ్రీదేవిని చూడగానే ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఆ పాత్రను అద్భుతంగా పోషించిన శ్రీదేవి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. భారతదేశంలో పూర్తి పురుషాధిక్య ప్రపంచంగా ఉన్న సినీ పరిశ్రమలో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగారు. 

More Telugu News