Sridevi: చిన్నారి శ్రీదేవి గురించి చంద్రమోహన్!

  • ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర వేసిన శ్రీదేవి
  • నారదుడి పాత్ర పోషించిన చంద్రమోహన్
  • మరో మూడేళ్లకు 16 ఏళ్ల వయసు సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి

శ్రీదేవి ఏడెనిమిదేళ్ల వయసులో ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర వేసిందని, ఆ సినిమాలో తాను నారదుడి పాత్ర పోషించానని శ్రీదేవి తొలి తెలుగు సినీ హీరో చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే శ్రీదేవి చాలా క్రమశిక్షణగా ఉండేదని, బిస్కెట్లు తింటూ కూర్చునేదని, ఆమెను చూస్తే చాలా ముచ్చటేసేదని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఆమె మంచి స్థాయికి చేరుకుంటుందని ఊహించానని ఆయన చెప్పారు.

‘యశోద కృష్ణ’ సినిమాలో తన షూటింగ్ ముగిసిన తరువాత ఆమె మద్రాసుకు వెళ్లాలి, అయితే ట్రైన్ టికెట్స్ దొరకలేదు. దీంతో ఆమె తల్లి తన దగ్గరకు వచ్చి, 'మద్రాసులో షూటింగ్ ఉంది. మీ కారులో శ్రీదేవి రావడానికి వీలుపడుతుందా?' అని అడిగారని తెలిపారు. దీంతో శ్రీదేవిని తనతో తీసుకుని వెళ్లానని, సుమారు 14 గంటల ప్రయాణంలో శ్రీదేవి హాయిగా తన ఒళ్లో నిద్రపోయిందని చంద్రమోహన్ తెలిపారు.

అయితే మరో మూడేళ్లకు ఆమె తనపక్కన హీరోయిన్ గా నటిస్తుందని మాత్రం అప్పుడు తాను ఊహించలేదని చంద్రమోహన్ పేర్కొన్నారు. '16 ఏళ్ల వయసు' సినిమాకి హీరోయిన్‌ గా శ్రీదేవిని తీసుకుందామని రాఘవేంద్రరావు అన్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారని, అయితే తమిళంలో కమలహాసన్‌ తో ఆమె ఇదే సినిమాలో బాగా చేసిందని చెప్పి రాఘవేంద్రరావుగారు ఒప్పించారని తెలిపారు. తనకు కూడా శ్రీదేవితో నటించేందుకు అభ్యంతరం కనిపించలేదని, దీంతో ఆ సినిమా చేయడం, సక్సెస్ కావడం, హీరోయిన్ గా ఆమె అందనంత దూరం వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. 

More Telugu News