Andhra Pradesh: నవ్యాంధ్రకు పెట్టుబడుల వెల్లువ.. రూ.52 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన రిలయన్స్

  • పెట్టుబడులకు ముందుకొస్తున్న పారిశ్రామిక వేత్తలు
  • రెండో రోజు 285 అవగాహన ఒప్పందాలు
  • రూ.1.76 లక్షల కోట్ల విలువైన పెట్టబడులు
  • 2.86 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

నవ్యాంధ్రపై పెట్టుబడిదారులు విశ్వాసం చూపుతున్నారు. ఏపీని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ హబ్‌గా మార్చేందుకు ముందుకొస్తున్నారు. ఇందుకోసం భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. విశాఖపట్టణంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ) రెండో రోజైన ఆదివారం ఏకంగా 285 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. తద్వారా రూ.1,74,569 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఫలితంగా 2,86,371 మందికి ఉపాధి లభించనుంది.

ఒక్క రిలయన్స్ గ్రూపే దశలవారీగా రూ.52 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.15 వేల కోట్లు, పెట్రోలియం రంగంలో రూ.37 వేల కోట్లు పెట్టనున్నట్టు రిలయన్స్ తెలిపింది. ప్రభుత్వం-పారిశ్రామికవేత్తల మధ్య కుదిరిన ఒప్పందాల్లో అధికశాతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనే జరిగాయి. ఈ రంగంలో 169 ఒప్పందాలు కుదరగా, ఇంధన రంగంలో రూ.11921 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లో కలిపి మొత్తం 364 ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులకు అవసరమైన వాతావరణం కల్పించడం వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ్‌రెడ్డి చెప్పారు.

More Telugu News