chandrababu: రాజకీయ అపర చాణక్యుడు చంద్రబాబు@40... సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఎలా జరిగింది?

  • 1978 ఫిబ్రవరి 25వ తేదీన పోలింగ్
  • బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న యువ చంద్రబాబు
  • అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనుతిరిగి చూడని జననేత

సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన పోలింగ్ లో... దేశ స్థాయిలో చక్రం తిప్పగలిగే ఒక రాజకీయ అపర చాణక్యుడు పుట్టుకొస్తాడని ఎవరూ ఊహించలేదు. అప్పటిదాకా ఎస్వీ యూనివర్శిటీలో మాత్రమే పేరు వినిపించిన ఓ యువకుడు... దేశ రాజకీయాలను శాసించబోతాడని ఎవరూ అనుకోలేదు. కానీ, ఆ యువకుడిలో ఏదో ఉందని భావించిన ఓటర్లు... అతనికి మద్దతుగా బ్యాలెట్ పేపర్ పై ఓటు వేశారు. ఫలితం... ఒక బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి... రాజకీయరంగంలోకి ఆ యువకుడు అడుగుపెట్టాడు. అతనే నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని ఆయన... ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఢిల్లీలో చక్రం తిప్పేంత స్థాయికి ఎదిగారు.

అప్పుడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో దేశం నలిగిపోయిన రోజులు. ఆ తర్వాత తన రాజకీయ అవసరాల కోసం ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలో 1977 మార్చిలో లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీతో వ్యతిరేకతను మూటగట్టుకున్న ఇందిరాగాంధీ... ఆ ఎన్నికల్లో కొట్టుకుపోయారు. అయితే, ఊహించని విధంగా ఏపీలో మాత్రం 42 స్థానాలకు గాను 41 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జనతా పార్టీ ఒక్క స్థానంలో గెలిచింది.

ఇక మరో 11 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగానే జాతీయ స్థాయిలో ఇందిర ప్రాబల్యం బాగా తగ్గిపోయి... కాంగ్రెస్ పార్టీ ముక్కలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఆవు దూడ' గుర్తుతో ఉన్న కాంగ్రెస్ అలాగే ఉండిపోగా... హస్తం గుర్తుతో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటయింది. అప్పటిదాకా కాంగ్రెస్ లో ఉన్న ఎంతో మంది దిగ్గజాలు తలో దిక్కుకు వెళ్లిపోయారు. కొందరు జనతా పార్టీకి వెళ్లగా, మరికొందరు ఒరిజినల్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇంకొందరు సాహసం చేసి ఇందిరతోనే ఉండిపోయారు. ఇలాంటి పరిణామాల మధ్య 1978 ఫిబ్రవరి 25న సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఏపీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ పూర్తిగా పట్టుకోల్పోయిన సమయమది. ఈ పార్టీకి అభ్యర్థులు కూడా దొరుకుతారా? అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసిన రోజులు. అయితే, అత్యంత కీలకమైన ఏపీని వదులుకోవడానికి ఇందిరాగాంధీ సిద్ధంగా లేరు. దీంతో సరికొత్త ప్రయోగానికి ఆమె శ్రీకారం చుట్టారు. అదే... 'యువ మంత్రం'. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉత్సాహవంతులైన యువతకు 20 శాతం సీట్లు ఇస్తామని ఇందిర ప్రకటించారు. అయినప్పటికీ, ఇందిరా కాంగ్రెస్ లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని చాలా మంది భావించారు. అలాంటి నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఒకటి.

మరోవైపు, అప్పటికే గత రెండేళ్ల నుంచి రాజకీయాల్లోకి రావాలని యూనివర్శిటీలో చదువుకుంటున్న చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందిర ప్రకటించిన కోటాకు తాను సరిపోతానని భావించిన ఆయన... నేను పోటీ చేస్తానంటూ ముందుకొచ్చారు. అప్పటికి చంద్రబాబు ఎవరికీ తెలియకపోయినా... ఇందిరా కాంగ్రెస్ కు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదు. చంద్రబాబుకు టికెట్ దక్కింది.

ఇక ఆయన ప్రత్యర్థి పట్టాభిరామచౌదరి (జనతా పార్టీ). జిల్లాలోనే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఏ రకంగా చూసినా ఆయన ముందు చంద్రబాబు దిగదుడుపే. చిత్తూరు ఇందిరా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాజగోపాల్ నాయుడికి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిపత్యం ఉన్నా... చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం పట్టులేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గెలవడం అసంభవం.

ఓ బలమైన నేతకు చంద్రబాబు ప్రత్యర్థి. చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు బలమైన నేతలు కూడా ఎవరూ రాలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆయన కూడా ఆశించలేదు. కేవలం తన మిత్రులు, సొంత అనుచరులతో కలసి ఎన్నికల బరిలోకి దిగారు. ఇంటింటికీ తిరిగారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ, ఓటు వేయమని కోరారు. జనతా పార్టీ, పట్టాభిరామ చౌదరిల ప్రభంజనాన్ని పట్టించుకోకుండా... గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగారు.

ఇక్కడే చంద్రబాబు ఓటర్ల మనసులను గెలుచుకున్నారు. అప్పటిదాకా, తమ ఇళ్లకు వచ్చి ఏ నాయకుడు ఓట్లు అడగలేదు. ఊర్లోకి వచ్చే నేతలు... గ్రామంలోని పెద్దమనుషులను పిలిచి, ఓటు వేయాలంటూ ఆదేశించేవారు. కానీ, చంద్రబాబు ప్రతి ఒక్కరినీ పత్యక్షంగా కలిశారు. 'ఓటు వేయండమ్మా, ఓటు వేయండన్నా' అని ఎంతో వినమ్రంగా అడిగారు. ఓ అభ్యర్థే వచ్చి స్వయంగా ఓటు వేయమని అడగడంతో... నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆనందించారు.

1978 ఫిబ్రవరి 25వ తేదీ. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ బూత్ లకు వచ్చిన ఓటర్లు... బ్యాలెట్ పేపరుపై స్వస్తిక్ ముద్ర రూపంలో ఓటు వేస్తున్నారు. పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో బలమైన రాజకీయ నేత గెలుస్తారా? లేదా యువతరానికి పట్టం కడతారా? అనే ఉత్కంఠ పెరిగింది. రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 27న ఎన్నికల ఫలితం వచ్చింది.

చంద్రగిరి ఓటర్లు పాత తరాన్ని పక్కనపెట్టి, యువకుడైన చంద్రబాబుకు జై కొట్టారు. 2494 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రానికి, దేశానికి ఒక గొప్ప నేతను చంద్రగిరి ప్రజలు అందించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి ఉంటే ఏం జరిగి ఉండేదనేది ఎవరూ ఊహించలేనటువంటి విషయం. ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు ఆ తర్వాత ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేంత స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 66 ఏళ్లు. జననేతగా ఆయన వయసు 40 ఏళ్లు. అయినా... 40 ఏళ్ల క్రితం ఉన్న అదే ఉత్సాహం, అదే పోరాటం, అదే కష్టపడే మనస్తత్వం. 

More Telugu News