Sridevi: బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్‌గా శ్రీదేవి సంచలనం.. ఆమె కెరీర్‌‌లో కొన్ని ముఖ్య ఘటనలు

  • చివరి వరకు కళామతల్లి సేవలోనే శ్రీదేవి
  • దశాబ్దాల ప్రస్థానంలో రారాణిగా ఎదిగిన అతిలోక సుందరి
  • హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్  స్పీల్‌బర్గ్ ఆఫర్‌ను తిరస్కరించిన ‘చాందిని’

లైట్స్, కెమెరా, యాక్షన్.. జీవితాంతం ఈ మూడు పదాల వెంట నడిచిన శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ ప్రియులను కలచివేస్తోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిగా వెలుగొందిన శ్రీదేవి హిందీలో 1983లో చేసిన రెండో చిత్రం ‘హిమ్మత్‌వాలా’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత ‘లమ్హే’ సినిమాతో ఆమె ప్రభ వెలిగిపోయింది. అనతికాలంలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగి బాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన తొలి నటిగా రికార్డు సృష్టించింది. దశాబ్దాల ప్రస్థానంలో తిరుగులేని నటిగా అవతరించింది. శ్రీదేవికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..

* ఆగస్టు 13, 1963లో శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్, రాజేశ్వరి దంపతులకు జన్మించింది. రాజేశ్వరి తెలుగువారు కాగా, అయ్యప్పన్ తమిళనాడుకు చెందినవారు.

* నాలుగేళ్ల వయసులో తిరుముగం తీసిన భక్తి సినిమా ‘తునైవం’లో నటించింది. 1975 నాటి సూపర్ డూపర్ హిట్ సినిమా ‘జూలీ’లో బాలనటిగా శ్రీదేవి నటించింది.

* బాలీవుడ్ సినిమా ‘లమ్హే’ సెట్స్‌లో ఉండగానే ఆమె తండ్రి అయ్యప్పన్ మరణించారు. ‘జుదాయి’ సినిమా చేస్తున్నప్పుడు తల్లి రాజేశ్వరి కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు నిరాకరించడంతో శ్రీదేవి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

* హాలీవుడ్ అగ్రదర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఒకానొక దశలో శ్రీదేవి తిరస్కరించింది.

* శ్రీదేవి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసినప్పుడు హిందీలో మాట్లాడడానికి ఇబ్బంది పడేది. ఆమె సినిమాలకు మరో స్టార్ హీరోయిన్ రేఖ డబ్బింగ్ చెప్పేది. ‘చాందిని’ సినిమాలో శ్రీదేవి తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

* అప్పట్లో జితేంద్ర-శ్రీదేవి జంట వెండితెరపై మోస్ట్ పాప్యులర్ కపుల్. ఇద్దరు కలిసి 16 సినిమాల్లో నటించారు. వీటిలో 11 సినిమాలు సూపర్ డూపర్ హిట్.

* పాటల్లో ఎక్కువ శాతం పొట్టి స్కర్టుల్లో కనిపించడంతో ఆమెకు ‘థండర్ థైస్’ అనే నిక్‌నేమ్ కూడా ఉంది.

* సీఎన్ఎన్-ఐబీఎన్ 2013లో నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో శ్రీదేవి ఈ శతాబ్దంలోనే గొప్ప నటిగా ఎంపికైంది.

More Telugu News