YSRCP: జగన్ పాదయాత్రలో చెలరేగిపోతున్న జేబు దొంగలు!

  • కాలేజీ కరస్పాండెంట్ నుంచి రూ. లక్ష అపహరణ
  • మహిళ మెడలోని గొలుసు చోరీ
  • అందినకాడికి దోచుకుంటున్న దొంగలు
  • లబోదిబోమంటున్న బాధితులు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో జేబు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. శనివారం ఆయన పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు యాత్రకు వస్తుండడంతో జేబు దొంగలు దీనిని ఆసరాగా తీసుకుని పనికానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జగన్‌ను చూసేందుకు వచ్చిన ఓ కాలేజీ కరస్పాండెంట్ నుంచి లక్ష రూపాయలు అపహరించిన దొంగలు, మరొకరి నుంచి రూ.70వేలు కొట్టేశారు. ఓ మహిళ నుంచి చైన్‌ను దొంగిలించారు. దీంతో లబోదిబోమంటున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
 
జగన్ తన పాదయాత్రలో భాగంగా కనిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా చంద్రబాబే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆయనను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. నాడు ప్రత్యేక హోదా దండగన్న బాబు.. నేడు హోదా వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.

More Telugu News