Chandrababu: 20 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం!: చంద్రబాబు

  • విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
  • హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా నిలుపుతామన్న చంద్రబాబు

వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని... ఇప్పుడు సేవలు, పరిశ్రమల రంగంపై దృష్టిసారించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

గత మూడున్నరేళ్ల కాలంలో రూ. 13.54 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నామని చెప్పారు. ఇవన్నీ సాకారమైతే 31 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఒప్పందాల్లో 59 శాతం వాస్తవరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన... రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

2022 నాటికి ఏపీని దేశంలో మూడో స్థానంలోను, 2029 నాటికి అగ్రస్థానంలోను నిలపడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. విశాఖలో మూడోసారి సీఐఐ సదస్సును నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాశ్వత కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, హోటల్స్ రానున్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు.  

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఈ సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు... 26వ తేదీన ముగుస్తుంది. 40 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 11 అంశాలపై ప్లీనరీ సెషన్లను నిర్వహించబోతున్నారు.

More Telugu News