jignesh mevani: నన్ను ఎన్ కౌంటర్ చేసి చంపే కుట్ర జరుగుతోంది: జిగ్నేశ్ మేవానీ సంచలన ఆరోపణ

  • దళితుడి మరణంతో అహ్మదాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన జిగ్నేశ్ మేవానీ
  • బంద్ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన జిగ్నేశ్  
  • వాట్స్ యాప్ లో హింస, ఎన్ కౌంటర్ కి సంబంధించిన రెండు వీడియోలు పోస్టు చేసిన అహ్మదాబాద్ డీఎస్పీ

తనను ఎన్ కౌంటర్ చేసి చంపేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని గుజరాత్ సంచలన దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సంచలన ఆరోపణలు చేశారు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన జిగ్నేశ్ మేవానీ.. తన ఎన్‌ కౌంటర్‌ కుట్రకు సంబంధించిన సాక్ష్యంగా పోలీస్ వాట్స్ యాప్ గ్రూప్ (ఏడీఆర్‌ అండ్‌ మీడియా) లో ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సంభాషణ లింక్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జిగ్నేశ్ మేవానీ చెప్పిన ఏడీఆర్‌ అండ్‌ మీడియా గ్రూప్ లో సీనియర్ పోలీసు అధికారులతో పాటు, మీడియా ప్రతినిధులు కూడా ఉండడం విశేషం.

 ఈ గ్రూప్ లో ఇటీవల అహ్మదాబాద్‌ డిప్యూటీ ఎస్పీ ఆర్బీ దేవ్‌ దా రెండు వీడియోలను పోస్టు చేశారు. వాటిలో ఒక వీడియోలో కొంతమంది పోలీసులు ఒక రాజకీయ నాయకుడ్ని చితక బాదుతుండగా, మరొక వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్‌ కౌంటర్లపై పోలీసులను ప్రశంసిస్తూ యూపీ సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. ఈ రెండు వీడియోలను గ్రూప్ సభ్యులకు పరిచయం చేస్తూ, పోలీసుల పట్ల అనుచితంగా గాని, వారికి వ్యతిరేకంగా గాని వ్యవహరిస్తే ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుందంటూ ఆ డీఎస్పీ క్యాఫ్షన్‌ ఇచ్చారు.

కాగా, ఇటీవల గుజరాత్ లో దళిత కార్యకర్త మరణం నేపథ్యంలో జిగ్నేశ్ అహ్మదాబాద్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో మేవానీకి వాగ్వాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి ఆ వీడియోలను పోస్టు చేయడంతో తనపై ఎన్ కౌంటర్ కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ వీడియోలతో గుజరాత్‌ హోం మంత్రి, హోం సెక్రటరీ, డీజీపీలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసే యోచనలో జిగ్నేశ్ మేవానీ ఉన్నారు. కాగా, ఈ వీడియోలపై డీఎస్పీ ఆర్బీ దేవ్ దా వివరణ ఇస్తూ, ఆ రెండు వీడియోలు ఫార్వర్డ్‌ మెసేజ్‌లేనని, వాటిలో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. 

More Telugu News