ke krishnamurty: కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉంది: కంగాటి శ్రీదేవి

  • కేఈ శ్యాంబాబు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
  • పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
  • హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడుల హత్య కేసులోని నిందితుడు శ్యాంబాబు తమను బెదిరిస్తున్నారని తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 2017 మే 21న నారాయణరెడ్డి, సాంబశివుడులను అత్యంత కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. ఈ కేసులో కేఈ శ్యాంబాబు, జెడ్పీటీసీ బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్ లతో సహా 15 మందిని నిందితులుగా చేర్చారని... అయితే డిప్యూటీ సీఎం తన పలుకుబడిని ఉపయోగించి శ్యాంబాబు, బొజ్జమ్మ, తులసీ ప్రసాద్ లపై కేసును తొలగించారని తెలిపారు.

ఈ వ్యవహారంపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా... కేసులో వీరందరినీ ముద్దాయిలుగా చేర్చి, అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే, శ్యాంబాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్టు ఓ పత్రికలో ప్రచురించారని... అది వాస్తవం కాదని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో స్టే వచ్చినా, తాము సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని... నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.

More Telugu News