అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు.. గ్యాంగ్ రేప్ చేశారంటున్న మహిళ.. ఖండించిన సీఎం!

24-02-2018 Sat 11:09
  • అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూపై అత్యాచార ఆరోపణలు
  • 10 ఏళ్ల క్రితం గ్యాంగ్ రేప్
  • మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధపడ్డ బాధితురాలు

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఖండూ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. 10 ఏళ్ల క్రితం పెమా, మరికొందరు కలసి తనపై గ్యాంగ్ రేప్ చేశారని ఆమె తెలిపింది. దీనిపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు, జాతీయ మహిళా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపింది. దీంతో, తగిన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధపడింది.

ఆమె చెబుతున్న వివరాల ప్రకారం... 2008లో పెమాతో పాటు మరో ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో తాను స్పృహలో లేనని... జరిగిన ఘటనపై తాను ఎంతో మందికి విన్నవించినా, ప్రయోజనం లేకపోయిందని చెప్పింది. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత (2015లో... ఖండూ సీఎం పదవిని చేపట్టడానికి కొన్ని నెలల ముందు) ఆమె ఈటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అదంతా ఉత్తిదేనని తేల్చారు. గత ఏడాది కాలంగా తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరోవైపు, బాధితురాలి ఆరోపణలను ఖండూ తీవ్రంగా ఖండించారు. ఆమె ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని అన్నారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ మండిపడింది.