Rakesh Jhunjhunwala: బ్యాంకుల్లో మోసాలు మన మంచికే: టాప్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా

  • ప్రభుత్వ రంగ సంస్థల్లో పెరుగుతున్న వ్యవస్థీకృత నేరాలు
  • ప్రైవేటీకరణ కోసం ప్రజల నుంచి పెరిగే డిమాండ్
  • 3 లేదా 4 బ్యాంకులు చాలన్న రాకేష్

బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసేవేనని భారత టాప్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోయాయని, ఇటువంటి నేరాలు, మోసాలు బయటపడటం వల్ల ప్రైవేటీకరణ చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారని, దీనికి ఎయిర్ ఇండియానే ఉదాహరణని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ విలీనం చేసి, కేవలం 3 లేదా 4 బ్యాంకులను మాత్రమే ఉంచాలని రాకేష్ సూచించారు.

పీఎస్యూ బ్యాంకులకు మూలధనాన్ని ప్రభుత్వం అందించడం వల్ల దీర్ఘకాలంలో అనుకూల ప్రభావాలకన్నా, ప్రతికూల ప్రభావమే అధికమని అభిప్రాయపడ్డ ఆయన, బ్యాంకులకు ఇలా నిధులు ఇస్తూ వెళితే, కొంతకాలం తరువాత మౌలిక వసతుల కల్పనకు నిధులు కరవవుతాయని అన్నారు. బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగులోకి రాకుంటే, ఇటువంటి స్కామ్ లు మరింతగా పెరుగుతూనే ఉంటాయని ఝున్ ఝున్ వాలా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బ్యాంకుల భవిష్యత్తు బాగుపడే సమయం వచ్చిందని తాను భావిస్తున్నానని అన్నారు.

వడ్డీరేట్లు ఇప్పటికిప్పుడు మారే అవకాశాలు లేవనే చెప్పవచ్చని, యూఎస్ ఫెడ్ తీసుకునే నిర్ణయాల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితం కాబోదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీని ఓ బఫే విందుతో అభివర్ణించిన ఆయన, బఫేలో చాలా రకాలుంటాయని, వాటిల్లో నచ్చినది ఎంచుకుని తినవచ్చని, అదే విధంగా స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఎటొచ్చీ వాటిని ఎంచుకోవడంలోనే నైపుణ్యత దాగుందని అన్నారు. ఇతరులు తమకు ఎందుకులే అని వదిలేసిన రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటూ లాభాలను సంపాదించేవాడే అసలు సిసలైన ఎంటర్ ప్రెన్యూర్ గా రాకేష్ అభివర్ణించారు.

More Telugu News