Telangana: నరబలి కేసులో పోలీసులను తప్పుదారి పట్టించిన రాజశేఖర్.. చెప్పినందంతా కట్టుకథే?

  • నిందితుడు చెబుతున్నవన్నీ అబద్ధాలే?
  • ఇంకా దొరకని చిన్నారి మొండెం
  • సాక్ష్యాల కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్, ఉప్పల్‌లోని చిలుకానగర్ నరబలి కేసు నిందితుడు రాజశేఖర్ పోలీసులను తప్పుదారి పట్టించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది. చిన్నారి అపహరణ నుంచి అతడు చెప్పినవన్నీ కట్టుకథలేనని సమాచారం.

చిలుకానగర్‌లో 25 రోజుల క్రితం రాజశేఖర్ ఇంటిపై మూడు నెలల చిన్నారి తల లభించడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ అయిన రాజశేఖర్‌తోపాటు అతడి భార్యను ఈనెల 15న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. గడువు ముగియడంతో శుక్రవారం తిరిగి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.

మూడు రోజులు విచారించిన పోలీసులు అతడి నుంచి అసలు సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. తొలుత సికింద్రాబాద్ బోయిగూడలోని రోడ్డు పక్కన గుడిసెలోని చిన్నారిని అపహరించినట్టు రాజశేఖర్ చెప్పాడు. అనంతరం ఆమె తలనరికి మొండాన్ని మేడిపల్లి ప్రతాపసింగారం శివారులోని మూసీ నదిలో పడేసినట్టు చెప్పాడు.

అయితే, బోయిగూడ నుంచి చిన్నారిని అపహరించినట్టు రాజశేఖర్ చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోతే ఆ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. దీంతో అతడు చెప్పింది కట్టుకథ అని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారిని ఎక్కడి నుంచో అపహరించైనా ఉండాలని, లేదంటే ఏదైనా తండాలో కొనుగోలు చేసైనా ఉండాలన్న వాదన వినిపిస్తోంది.  

రాజశేఖర్ ఇంట్లో దొరికిన రక్తపు మరకలు, చిన్నారి తలకు అంటిన రక్తపు మరకలు ఒకరివేనని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఈ కేసులో ఇది కీలకంగా మారినా, చిన్నారిని ఎక్కడి నుంచి అపహరించారు? మొండెం ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తే కానీ ఈ కేసు చిక్కుముడి వీడేలా కనిపించడం లేదు. మూసి నదిలో చిన్నారి మొండాన్ని పడేసినట్టు రాజశేఖర్ చెబుతుండడంతో అది లభించడం దాదాపు అసాధ్యం. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ లభిస్తే ఈ కేసులో పురోగతి వస్తుందని పోలీసులే చెబుతున్నారు. కాబట్టి, పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

More Telugu News