Venkaiah Naidu: బూతును విడిచిపెట్టి సందేశాత్మక చిత్రాలు తీయండి.. సినీ దర్శకనిర్మాతలకు వెంకయ్య పిలుపు

  • నేటి సినిమాల్లో బూతు ఎక్కువైంది
  • శృంగారం తక్కువ.. అంగారం ఎక్కువ అన్నట్టు తయారైంది
  • బి.నాగిరెడ్డిపై తపాళబిళ్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

ప్రస్తుతం సందేశాత్మక సినిమాలు తీసేవారే కరవయ్యారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయా వాహినీ స్టూడియోస్ అధినేత, విజయ హెల్త్ సెంటర్ స్థాపకులు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సేవలకు గుర్తుగా కేంద్రం రూపొందించిన తపాలా బిళ్లను చెన్నైలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఈనెల 25న నాగిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని విజయ హెల్త్ సెంటర్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, సీఈవో భారతీరెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. సినిమాల్లో అశ్లీలం, బూతు, హింసను విడిచిపెట్టి భారతీయతను, మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించే సందేశాత్మక సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలకు పిలుపునిచ్చారు.

నాగిరెడ్డి గొప్ప మానవతావాదని కొనియాడారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన దిగ్గజ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ఆయన సినిమాల్లో గొప్ప సందేశం ఉంటుందని, అందరికీ ఆమోదయోగ్యమైన శృంగారం ఉంటుందని అన్నారు. దురదృష్టవశాత్తు నేటి సినిమాల్లో అది ఎక్కువైందని, శృంగారం తక్కువ, అంగారం ఎక్కువ అయిందని అన్నారు. హింస, బూతు, అశ్లీలాన్ని భావితరాలకు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి హాజరైన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ‘నాగిరెడ్డి-ద లెజెండ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘మహానటి’ సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, రావి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News