Indian Bison: కొన్ని రోజులుగా స్థానికులను భయాందోళనలకు గురిచేస్తూ.. చివరికి బావిలో ప‌డ్డ‌ అడవి దున్న

  • అడవి దున్నను క్రేన్ సాయంతో సురక్షితంగా బయటకు తీసిన అటవీ శాఖ సిబ్బంది
  • ఇటీవల ఇద్దరు రైతులను గాయపరిచిన అడవి దున్న
  • వరంగల్ రూరల్ జిల్లాలో ఘటన

వరంగల్ రూరల్ జిల్లాలో వ్యవసాయ బావిలో పడ్డ అడవి దున్నను (Indian Bison) అటవీశాఖ అధికారులు రక్షించారు. ఆత్మకూరు మండలం పెంచికల్ పేట సమీపంలో వ్యవసాయ బావిలో అడవి దున్నను గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, హైదరాబాద్ అధికారులు, జూ పార్క్ డాక్టర్లు, సిబ్బందితో సమన్వయం చేసుకుని బావిలో నుంచి అడవి దున్నను క్రేన్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు.

  అడవి నుంచి బయటకి వచ్చి కొన్ని రోజులుగా రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. గీసుకొండలో మూడు రోజుల కింద ఇద్దరు రైతులను గాయపరిచిన అడవి దున్న కూడా ఇదే అని అటవీ అధికారులు స్పష్టం చేశారు.  సుమారు 25 ఫీట్ల లోతైన బావిలోపడిపోయిన దున్నకు కొన్ని గాయాలు అయినట్లు, దవడ దగ్గర ఎముక చిట్లి ఉంటుందనే అనుమానాన్ని డాక్టర్లు వ్యక్తం చేశారు.

 దీంతో ప్రమాద స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు ఆ తర్వాత హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కు తదుపరి వైద్యం కోసం తరలించారు. జూ పార్క్ కు చెందిన డాక్టర్ హకీమ్, వరంగల్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్ లు దానికి వైద్యం అందించారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, పీసీసీఎప్ పీకే ఝా, వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, వరంగల్ రూరల్ డీఎఫ్ ఓ పురుషోత్తం, ఇతర అటవీశాఖ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఏటూరు నాగారం, పాకాల రిజర్వు అటవీ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా ఈ రకమైన అడవి దున్నలు కనిపిస్తాయని, సాధారణంగా దట్టమైన అడవిలో గుంపులుగా అడవి దున్నలు తిరుగుతాయని అధికారులు తెలిపారు. ఆహారం లేక నీటి కోసం వెతుకుతూ అడవి బయటకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. రెండు దున్నలు అడవి నుంచి బయటకు వచ్చి వ్యవసాయ భూముల్లో తిరుగుతున్న సమాచారంతో స్థానిక రైతులను, పోలీసులను అప్రమత్తం చేశారు. అందులో ఒకటి ఇప్పుడు అటవీ అధికారులకు చిక్కింది. 

More Telugu News