Aam Aadmi Party: అలాంటి అధికారులను తన్నాల్సిందే...ఆప్ ఎంఎల్‌ఏ

  • బహిరంగ ర్యాలీలో ఆప్ ఎంఎల్‌ఏ బాల్యన్ వ్యాఖ్యలు
  • చీఫ్ సెక్రెటరీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్
  • అన్షుపై దాడి నిందితులకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి ఘటన వేడి ఇంకా చల్లారకముందే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంఎల్ఏ నరేష్ బాల్యన్ శుక్రవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్షు ప్రకాశ్ లాంటి వారు తన్నులకు అర్హులంటూ ఆయన ఇప్పటికే ఉన్న వివాదాన్ని మరింత జటిలం చేసేశారు. ఉత్తమ్ నగర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ....చీఫ్ సెక్రెటరీకి ఏమైందో అర్థంకావడం లేదని, ఆయన తమపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాల్యన్ మండిపడ్డారు.

అందువల్లే అన్షు లాంటి అధికారులను తన్నాల్సిందేనని, సామాన్యుల పనులను అడ్డుకునే వారికి ఇలాంటి శాస్తి జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ చీఫ్ సెక్రెటరీపై దాడి కేసులో నిందితులయిన ఆప్ ఎంఎల్‌లు అమనతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ వేసుకున్న బెయిల్ వినతిని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. వారిద్దరినీ పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన పనిలేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ షెఫాలీ బర్నాలా స్పష్టం చేశారు. ఆ ఇద్దరు ఎంఎల్‌ఏలను కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.

More Telugu News