DM: 'పద్ధతి మారకుంటే గొంతుకోస్తా'... కలెక్టర్ వార్నింగ్...!

  • క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లనందుకు సీరియస్
  • ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన కలెక్టర్ 'వార్నింగ్' వీడియో
  • దుమారం రేగడంతో తన మాటలు వక్రీకరించారని వివరణ

యూపీలోని షహరన్‌పూర్ జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) పీకే పాండే పంచాయతీ అధికారులపై శివాలెత్తిపోయారు. పనిలో అలసత్వం ప్రదర్శించినందుకు ప్రత్యేకించి ఓ ఉద్యోగిని చీవాట్లు పెడుతూ 'గొంతు కోస్తా' అని ఆయన గట్టిగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బెహాత్‌లోని పంచాయతీ కార్యాలయానికి పాండే బుధవారం ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన ఆయన అధికారులపై ప్రత్యేకించి ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే అధికారం మీకున్నా మీ ప్రాంతాల్లో మీరు పర్యటించరు. మీ పద్ధతి మార్చుకోకుంటే మీ గొంతు కోస్తా" అని కలెక్టర్ హెచ్చరించారు. ఇదే విషయమై ఆయన్ను వివరణ కోరితే... తన మాటలను వక్రీకరించారని, తాను ఆ విధంగా అనలేదని ఆయన ఆత్మరక్షణలో పడ్డారు.
 
అసలు తన ఉద్దేశం అది కాదని, తన మాటలను అపార్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన తెలిపారు. అందువల్లే రికార్డులు సరిగా నిర్వహించాలని, ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలసత్వం ప్రదర్శిస్తే ఎవరైనా కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాత్రమే తాను హెచ్చరించానని కలెక్టర్ పాండే వివరణ ఇచ్చుకున్నారు.

More Telugu News