Virender sehwag: స్టూడెంట్ల తల్లిదండ్రులకు సెహ్వాగ్ మనవి!

  • మార్కులు తక్కువొస్తే పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని హితవు
  • భుజం తట్టి ముందుకు నడిపించాలని సూచన
  • భవిష్యత్తులో పిల్లలు గొప్ప విజయాలు సాధిస్తారని వెల్లడి

స్కూలు విద్యార్థులు త్వరలో పరీక్షలు రాయనున్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ మనవి చేశారు. "మీ పిల్లల పరీక్షలు త్వరలోనే మొదలుకానున్నాయి. పిల్లలు బాగా రాయాలని మీరు నిజంగానే ఎంతో ఆత్రుతతో ఉంటారని నాకు తెలుసు. కానీ, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. పరీక్షలు రాసే విద్యార్థుల్లో ఓ కళాకారుడు ఉంటాడు. అతనికి గణితం గురించి అవసరం లేదు. ఓ వ్యాపారి ఉంటాడు. అతనికి చరిత్ర లేదా ఆంగ్ల సాహిత్యం గురించి పనిలేదు. ఓ సంగీత విద్వాంసుడు ఉంటాడు. అతనికి రసాయన శాస్త్రంలో మార్కులు పెద్ద విషయం కాదు. ఓ అథ్లెట్ ఉంటాడు. అతనికి ఫిజిక్స్ కంటే ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా అవసరం.

ఒకవేళ మీ పిల్లలు మంచి మార్కులు సాధిస్తే గొప్ప విషయమే. అలా కాని పక్షంలో వారి ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని దెబ్బతీయకండి. పర్లేదని వారి భుజం తట్టి ముందుకు నడిపించండి. ఇది ఓ పరీక్ష మాత్రమే. వారు జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించగలరు. ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదని వారికి చెప్పండి. వారిని మీరు ప్రేమించండి. వారి గురించి ఇప్పుడే ఓ నిర్ణయానికి రాకండి" అంటూ ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ పిల్లల తల్లిదండ్రులకు సందేశమిచ్చారు.

More Telugu News