Harmanpreet Kaur: ముఖ్యమంత్రి చొరవతో సమస్య పరిష్కారం.. డీఎస్పీగా హర్మన్‌ప్రీత్ కౌర్!

  • మహిళల ప్రపంచకప్‌లో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్
  • డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన సొంతరాష్ట్రం పంజాబ్
  • ఉద్యోగం నుంచి రిలీవ్ చేయని పశ్చిమ రైల్వే
  • రైల్వే మంత్రికి పంజాబ్ సీఎం లేఖతో సమస్య పరిష్కారం

భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొత్తానికి పంజాబ్ పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించే శుభముహూర్తం వచ్చేసింది. మార్చి 1న ఆమె డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించనుంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది.  

గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావడంతో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. పోలీస్ అంటే ఎంతో ఇష్టమున్న హర్మన్ ఈ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో పశ్చిమ రైల్వేలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. సరిగ్గా ఇదే వివాదానికి కారణమైంది. పశ్చిమ  రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో డీఎస్పీగా చేరాలన్న హర్మన్ ప్రీత్ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.

ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆమె ప్రైవేటు ఉద్యోగంలో చేరడం లేదని, సొంత రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగంలో చేరుతోంది కనుక అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే హర్మన్ ప్రీత్‌తో కుదుర్చుకున్న బాండ్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే నెల 1న ఆమె డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించనుంది. రైల్వేకు లేఖ రాసి సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం అమరీందర్‌కు ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News