Andhra Pradesh: ఆ రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు...మాకెందుకివ్వరు?: కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు

  • ప్రత్యేకహోదా ఇకపై ఏ రాష్ట్రానికీ ఇవ్వమని అన్నారు
  • మరి రాష్ట్రాలకు ఆ హోదా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు?
  • మా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరు?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే, ప్రత్యేకహోదా ఇకపై ఏ రాష్ట్రానికి ఇవ్వం, ఏపీకి ప్రత్యేకహోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా మోటార్స్‌ సంస్థ ఫ్రేమ్‌ ఇన్‌ స్టలేషన్‌ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికే ఆ హోదా పొందిన రాష్ట్రాలకు ఇంకా ఎందుకు ప్రత్యేకహోదాను కొనసాగిస్తోందని అడిగారు.

ఆ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ కొనసాగిస్తున్నప్పుడు, మా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరు? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము డిమాండ్ చేస్తున్నవన్నీ సహేతుకమైనవేనని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో తమ రాష్ట్ర తలసరి ఆదాయమే తక్కువగా ఉందని ఆయన చెప్పారు. తామంతా కష్టపడుతుండడంతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా, హామీల అమలు సాధన తమ హక్కని, దానిని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు. 

More Telugu News