manish pandey: ఐదవ నెంబరు స్థానంలో కుదురుకోవడం చాలా కష్టం! -మనీశ్ పాండే

  • రిజర్వ్ బెంచ్ లో కూర్చోవడం కష్టం
  • టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది
  • ఐదో నెంబర్ కంటే ముందు బ్యాటింగ్ కి వస్తే మరిన్ని పరుగులు చేస్తాను

టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూడడం.. జట్టులో యువరాజ్ సింగ్, సురేష్ రైనా నిలదొక్కుకున్న ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయమని టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మనీశ్ పాండే అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 79 పరుగులతో రాణించిన నేపథ్యంలో మనీశ్ పాండే మాట్లాడుతూ, జట్టుకు ఎంపిక కావడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత రిజర్వ్ బెంచ్ కే పరిమితమై మైదానంలో ఉండి మ్యాచ్ చూడడం అన్నది ఒక ఆటగాడికి చాలా కష్టమైన పని అని పేర్కొన్నాడు.

అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాలో స్థానం కావాలంటే ఆమాత్రం వేచి చూడాల్సిందేనని చెప్పాడు. ఇక టీమిండియా తరపున ఎన్నో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు బ్యాటింగ్ కు దిగిన ఐదో నంబర్ స్థానం చాలా క్లిష్టమైనదని చెప్పాడు. ఈ స్థానంలో తాను నిలదొక్కుకుంటున్నప్పటికీ భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్ లో తన కంటే కోహ్లీ, ధోనీ వంటి వారు ముందున్నారని, అంతేకాకుండా మన టాప్ ఆర్డర్ 30 నుంచి 35 ఓవర్లు బ్యాటింగ్ చేస్తోందని చెప్పాడు. టాపార్డర్ అంత నిలకడగా ఆడుతున్నప్పుడు తనకు ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే వెసులుబాటు ఉండదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో తాను ఇంకా ముందుగా వస్తే మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంటుందని మనీశ్ పాండే తెలిపాడు. 

More Telugu News