Students: తెలంగాణ విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు

  • దాదాపు 30 లక్షల మందికి వైద్య పరీక్షలు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి హెల్త్ కార్డుల జారీ
  • 8 లక్షల మందికి ఆరోగ్య సంరక్షణ కిట్‌ల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారికి హెల్త్ కార్డులు జారీ చేయనుంది. జులై నుండి వైద్య పరీక్షలను మొదలుపెట్టి ఈ ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా విద్యార్థులకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తారు.

మరోవైపు ఎస్‌సీ/ఎస్‌టీ/బీసీ/మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, కేజీబీవీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో పేరు నమోదైన సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కిట్‌లను కూడా పంపిణీ చేయనుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులందరూ లబ్ధి పొందేలా వైద్య పరీక్షలకు సంబంధించి విద్యా సంస్థల వారీగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను వారు ఆదేశించారు.

More Telugu News