Rohit Sharma: రోహిత్ శర్మ 'డకౌట్ల' రికార్డు..!

  • పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సార్లు డకౌట్
  • తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్, నెహ్రా
  • కేప్‌టౌన్‌లో శనివారం ఆఖరి మ్యాచ్

టీమిండియాలో రోహిత్ శర్మ పేరు చెప్పగానే గుర్తొచ్చేది అంతర్జాతీయ వన్డేల్లో అతను మూడుసార్లు బాదిన ద్విశతకాలే. ఆ రకంగా అత్యధిక ద్విశతకాల క్రికెటర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. క్రీజులో గట్టిగా నిలబడితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు. వారి పాలిట సింహస్వప్నమవుతాడు. అలాంటి రోహిత్ ఈ టీ-20 సిరీస్‌ సందర్భంగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ టీ-20ల్లో భారత్ తరపున అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో అతను నెంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో బుధవారం సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో రోహిత్ తొలి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. ఇప్పటివరకు అతను అసలు పరుగులేమీ చేయకుండానే నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు.

రోహిత్ తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్ (3 సార్లు), ఆశిష్ నెహ్రా (3 సార్లు) ఉన్నారు. సౌతాఫ్రికా టూర్‌లో మొదట్నుంచీ రోహిత్ తడబడుతూనే ఉన్నాడు. అంతకుముందు జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలోనూ ఆశించిన స్థాయిలో అతను రాణించలేకపోయాడు. పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన వన్డేలో చేసిన శతకం తప్ప ఆ స్థాయిలో ఇప్పటివరకు వీరబాదుడు బాదలేదు. కాగా, రెండో టీ-20లో భారత్ ఓడిపోవడంతో శనివారం కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి మ్యాచ్ కీలకంగా మారింది.

More Telugu News