dmk: డీఎంకే వీరాభిమానికి అరుదైన ఆహ్వానం.. ఉబ్బితబ్బిబైన వృద్ధురాలు!

  • డీఎంకే వీరాభిమాని డెబ్భై ఏళ్ల వృద్ధురాలు పాపాత్తి
  • తన ఇంటికి ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చిన స్టాలిన్
  • ఆపై, కరుణానిధి వద్దకు తీసుకెళ్లి పరిచయం

డీఎంకే వీరాభిమాని పాపాత్తికి అరుదైన అవకాశం లభించింది. డీఎంకే నేత స్టాలిన్ నుంచి ఆమె ఆహ్వానం అందుకుంది. అసలు, ఆమెకు ఆహ్వానం ఎందుకు పంపాల్సి వచ్చిందంటే.. ఈరోడ్ జిల్లాకు చెందిన డెబ్భై నాలుగు సంవత్సరాల వృద్ధురాలు పాపాత్తి. డీఎంకేకు ఆమె వీరాభిమాని. కొన్ని రోజుల కిందట పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ని చూడాలనే ఉద్దేశ్యంతో చెన్నైలోని అన్నా అరివాలయం వద్దకు వెళ్లింది.

అయితే, పార్టీ కార్యకర్తలు, నిర్వాహకుల సమావేశంలో స్టాలిన్ తీరిక లేకుండా ఉన్నారు. ఎలాగైనా సరే, స్టాలిన్ ని కలిసి వెళ్లాలని గంటల తరబడి ఆమె నిరీక్షించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎంత సేపు వేచి చూసినా స్టాలిన్ ని కలవడం కష్టమంటూ అక్కడి వాళ్లు చెప్పడంతో నిరాశతో పాపాత్తి వెనుదిరిగింది. 
అయితే, ఈ విషయాన్ని స్థానిక వార్తాపత్రికలు హైలైట్ చేస్తూ, కొన్ని కథనాలు రాశాయి. దీంతో, స్పందించిన స్టాలిన్.. ఈరోడ్ డీఎంకే నిర్వాహకుల ద్వారా పాపాత్తికి ఆహ్వానం పంపారు. ఆళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసానికి నిన్న పాపాత్తి వెళ్లింది. ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించిన స్టాలిన్, తేనీటి విందు ఇచ్చారు. అనంతరం,  ఆమెతో కలిసి స్టాలిన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఊహించని పరిణామానికి తబ్బిబ్బయిపోయిన పాపాత్తికి మరో అరుదైన అవకాశాన్ని కూడా స్టాలిన్ కల్పించారు. డీఎంకే అధినేత కరుణానిధి వద్దకు ఆమెను తీసుకెళ్లి పరిచయం చేశారు. ఇంకా, చెప్పేదేముంది.. తన ఆరాధ్య దైవమైన కరుణానిధిని చూసిన పాపాత్తి పొంగిపోయింది. కరుణానిధికి నమస్కరించిన ఆమె, ఆయన చేతిని ఆప్యాయంగా ముద్దాడింది. 

More Telugu News