Arvind Kejriwal: కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు అంతే: తేల్చి చెప్పిన ఐఏఎస్ అధికారుల సంఘం

  • సీఎస్‌పై దాడి కేసులో ముదురుతున్న వివాదం
  • సీఎం క్షమాపణకు ఐఏఎస్ అధికారుల డిమాండ్
  • ఈ విషయంలో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రుల భేటీలకు హాజరుకాబోమని ఐఏఎస్ అధికారుల సంఘం తేల్చి చెప్పింది. సీఎస్‌పై దాడికి నిరసనగా బుధవారం నల్లబ్యాడ్జీలు వేసుకుని విధులకు హాజరైన ఐఏఎస్ అధికారులు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.

ఈ కేసులో ‘ఆప్’ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అన్షుప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ సలహాదారుడైన వీకే జైన్‌ను విచారించారు. మరోసారి ఆయనను విచారించనున్నట్టు ఢిల్లీ డీసీపీ మధుర్ వర్మ తెలిపారు. ఇక ఈ గొడవలో తాము తలదూర్చబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు-అధికారులు గొడవ పడడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని కాబట్టి తక్షణం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి మార్గం చూపించాల్సిందిగా ఓ న్యాయవాది వేసిన పిల్‌పై హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

మంగళవారం అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌తోపాటు అమానుతుల్లా ఖాన్‌లను విచారించేందుకు పోలీసులు కోర్టు అనుమతిని కోరారు. పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో ఎమ్మెల్యేలను  తిహార్ జైలుకు తరలించారు.

More Telugu News