Chandrababu: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర లేదు: మంత్రి సోమిరెడ్డి

  • ఓటుకు నోటు కేసులో వినపడే వాయిస్ చంద్రబాబుది కాదు 
  • చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్ కు ఉందా?
  • విజయసాయిరెడ్డి వల్లే జైలుకెళ్లిన జగన్ 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో వినపడే వాయిస్ చంద్రబాబుది కాదని అన్నారు. ఒకవేళ ఆ వాయిస్ చంద్రబాబుదే అయినా కూడా అందులో ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు లేవని హైకోర్టు జడ్జి చెప్పారని అన్నారు.

నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఓటు వేయమని చెప్పడమే వినపడుతుంది తప్ప, ఫలానా పార్టీకి ఓటెయ్యమని చెప్పలేదని జడ్జి చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత వైసీపీ అధినేత జగన్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరని, విజన్ ఉన్న వ్యక్తిని పట్టుకుని వైసీపీ నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు.  

విజయసాయిరెడ్డి తప్పుడు సలహాల వల్లే జగన్ జైలుకెళ్లాడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే వైసీపీ అధినేత జగన్ జైలుకెళ్లారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీనియర్ ఐఏఎస్ లు సతీష్ చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. జగన్ దురాశ కారణంగా పన్నెండు మంది ఐఏఎస్ లు కేసుల్లో ఇరుక్కున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దోపిడీకి పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News