Jagan: పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ జగన్ ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్... ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత!

  • ప్రజా సంకల్పయాత్రకు నేటితో 94 రోజులు
  • పొన్నలూరు మండలంలో అడ్డుకున్న ఎమ్మార్పీఎస్
  • ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్
  • సర్దిచెప్పిన వైకాపా నేతలు

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 'ప్రజా సంకల్పయాత్ర'ను చేపట్టి, గత 94 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కు తొలి అడ్డంకి నేడు ఎదురైంది. తన పాదయాత్రలో భాగంగా పొన్నలూరు మండలం అగ్రహారానికి జగన్ చేరుకున్న వేళ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని, దీనిపై స్పష్టమైన ప్రకటన జగన్ నోటి నుంచి వచ్చేంత వరకూ తాము యాత్రను సాగనివ్వబోమని చెబుతూ, పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అడ్డుకున్న జగన్ వ్యక్తిగత సిబ్బంది, స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ విషయంలో జగన్ తప్పకుండా స్పందిస్తారని, యాత్రను అడ్డుకోవడం సబబు కాదని, అది తప్పుడు సంకేతాలు పంపుతుందని వైకాపా నేతలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు సర్దిచెప్పారు.

More Telugu News