Nirav Modi: పీఎన్బీ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఋణం తీసుకున్నారు..!

  • పీఎన్‌బీ నుండి 5 వేల లోన్ తీసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి
  • మరణానంతరం రుణం చెల్లించామన్న శాస్త్రి తనయుడు
  • నాన్న సొంత పనులకు అఫీసు కారు వాడొద్దన్నారని వెల్లడి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కు దాదాపు రూ.11,400 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరి తీసుకున్న ఆ రుణాలను చెల్లిస్తాడో... లేక లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మాదిరిగా విదేశాల్లో ఉండే న్యాయపోరాటం చేస్తాడో ప్రస్తుతానికైతే సస్పెన్సే. నీరవ్ జాడ గురించి ఇప్పటికే అన్వేషణ షురూ అయింది. ఈ స్కాంలో ఎంతమంది చేతివాటం చూపించారో తెలుసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కూడా రంగప్రవేశం చేసింది.

ఇటీవల కాలంలో మాల్యా, నీరవ్ లాంటి బడా వ్యాపారులు బ్యాంకుల నుండి పలు (మోసపూరిత) మార్గాల్లో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇదో నయా ట్రెండ్‌గా మారిపోతోంది. లక్షో, రెండు లక్షలో రుణాల కోసం తాము బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటే ఇలాంటి వ్యాపారులు లాబీయింగ్ ద్వారా సంబంధిత అధికారులకు కమీషన్లు ముట్టజెప్పి తమ పని చేయించుకోవడంపై సాధారణ జనాలు గుర్రుగా ఉన్నారు. ఇది నేటి పాలకుల రాజదక్షత లేమికి, బ్యాంకు అధికారుల స్వార్థచింతనకు నిదర్శనంగా వారు భావిస్తున్నారు.

అయితే దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పీఎన్‌బీ నుండి తీసుకున్న ఐదు వేల రూపాయల రుణాన్ని ఆయన మరణానంతరం ఆయన కుటుంబం తిరిగి చెల్లించి వారి నిజాయతీని చాటుకోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి తన తండ్రి రుణం చెల్లింపు గురించి చెప్పారు. తాము స్కూల్‌కు టాంగాలోనే వెళ్లేవాళ్లమని, ఆఫీసు కారును సొంత పనులకు వాడరాదంటూ తన తండ్రి చెప్పేవారని తన గత అనుభవాన్ని అనిల్ శాస్త్రి నెమరువేసుకున్నారు.

"1964లో కొత్త ఫియట్ కారును కొనాలనుకున్నాం. అప్పట్లో దాని ధర రూ.12 వేలు. నాన్నగారి బ్యాంకు ఖాతాలో ఏడు వేలే ఉన్నాయి. మరో ఐదు వేలను ఆయన బ్యాంకు నుండి రుణంగా తీసుకున్నారు. జనవరి 11, 1966లో ఆయన కన్నుమూశారు. తర్వాత ఆ రుణాన్ని మా అమ్మగారి పెన్షన్ నుండి తిరిగి చెల్లించాం" అని శాస్త్రి చెప్పారు.

లాల్ బహదూర్ శాస్త్రి వాడిన ఫియట్ కారు ప్రస్తుతం న్యూఢిల్లీలోని 1, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ వద్ద ప్రదర్శిస్తున్నారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న ఐదువేల రుణాన్ని ఆయన కుటుంబం చెల్లించి భావి తరాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ, నేడు మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు రుణాలను ఎగ్గొట్టడంలో మోసగాళ్లకు 'రోల్ మోడళ్లు'గా మారారన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.

More Telugu News