Syriya: ఉగ్రవాదులు లక్ష్యంగా సిరియా బాంబుల వర్షం... 200 మంది పౌరుల మృతి!

  • తూర్పు గౌటాపై విరుచుకుపడిన సైన్యం
  • 57 మంది చిన్నారులు సహా 200 మంది మృతి
  • క్షతగాత్రులతో కిక్కిరిసిన ఆసుపత్రులు
  • మరో దాడికి అవకాశం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను హతమార్చాలన్న ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో 200 మంది పౌరులు మృతిచెందారు. కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల అధీనంలోని తూర్పు గౌటా ప్రాంతంపై విరుచుకుపడిన సైన్యం విచక్షణా రహితంగా బాంబులేసింది. బాంబులు వచ్చి పడుతుంటే, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో 57 మంది చిన్నారులు సహా 200 మంది మృత్యువాతపడగా, మరో 300 మందికి గాయాలు అయ్యాయని మానవ హక్కుల పరిశీలనా సంస్థ పేర్కొంది.

సోమవారం నాటి దాడుల్లో ప్రాణనష్టం అధికంగా ఉందని, గాయపడిన వారి పరిస్థితి మరింత దయనీయమని, ఆసుపత్రుల్లో వారికి చికిత్స కష్టమవుతోందని తెలిపింది. మూడేళ్ల క్రితం డమాస్కస్ శివార్లలో జరిపిన దాడి తరువాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం ఉంటుండగా, ఇక్కడ మరోసారి సైన్యం దాడికి పాల్పడవచ్చని 'అల్ వతన్' పత్రిక అభిప్రాయపడింది. ఇక్కడి సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

More Telugu News