Andhra Pradesh: 24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు : మంత్రి అమరనాథ్ రెడ్డి

  • 11 అంశాలపై ప్లీనరీ సెషన్స్
  • 8 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్
  • కొరియా, జపాన్ దేశాల ప్రత్యేక సెషన్స్
  • భారీగా పెట్టుబడుల రాక : మంత్రి అమరనాథ్ రెడ్డి

విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భాగస్వామ్య సదస్సు జరుగుతుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సదస్సుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. ఈ సదస్సు ప్రారంభం రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరవుతారని చెప్పారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సులో గతంలో కేంద్ర ప్రభుత్వం సెషన్స్ మాత్రమే జరిగేవని, ఈసారి  కేంద్రానికి చెందిన 11 ప్లీనరీ సెషన్స్ తోపాటు 8 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్ ఉంటాయని తెలిపారు. ఈ సదస్సులో 14 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, అంతర్జాతీయంగా పేరున్న 39 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు మొత్తం 2500 మందిని ఆహ్వానించినట్లు వివరించారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో పొందుపరిచామని, కష్టపడి పెట్టుబడులు రాబడుతున్నట్లు చెప్పారు. అనంతపురంలోని కియా ప్లాంట్‌లో రూప్‌వర్క్‌ ఇన్‌స్టలేషన్‌ పనులను ఈ నెల 22న చంద్రబాబు ప్రారంభిస్తారని అమరనాథ్ రెడ్డి తెలిపారు.

భాగస్వామ్య సదస్సులోభాగంగా ప్లీనరీ సెషన్స్ లో సన్ రైజ్ ఏపీ, ఇండస్ట్రీ 4.0, స్కిల్ డెవలప్ మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, మౌలికవసతుల అభివృద్ధి, రాష్ట్ర సెషన్స్ లో ఆటోమొబైల్, టెక్స్ టైల్, పునరుత్పాదక శక్తి, పర్యాటకం, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ ఎక్విప్ మెంట్ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అంతేకాకుండా కొరియా, జపాన్ దేశాలకు చెందిన రెండు సెషన్స్ కూడా జరుగుతాయని అమర్ నాథ్ రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో సముద్రతీరం అధికంగా ఉండటం, వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఆశాజనకంగా ఉండటంతో పాటు ఈ రంగానికి ఇక్కడ అనుకూల వాతావరణం కూడా ఉందని ఆయన అన్నారు. ఈ రంగం అభివృద్ధి చెందడం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఇటు వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్థాలు లభిస్తాయని పేర్కొన్నారు.

More Telugu News