UK government: ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా.. బ్రిటన్‌లో భారీ నిరసనకు రెడీ అవుతోన్న భారత నిపుణులు!

  • శాశ్వత నివాస దరఖాస్తులపై జాప్యానికి నిర్ణయం
  • నిరసనకు ఇతర దేశాల నిపుణుల మద్దతు
  • సమస్యల పరిష్కారానికి ప్రధాని థెరీసాకి హెచ్ఎస్ఎం వినతి

యూకే ప్రభుత్వ ఇమిగ్రేషన్ విధానాలు తమకు ప్రతికూలంగా ఉన్నాయంటూ అపార అనుభవమున్న భారతదేశ నిపుణులు ఈ వారంలో ఆ దేశ పార్లమెంటు వెలుపల భారీ నిరసనకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమకు మద్దతుగా ఇతర దేశాలకు చెందిన వారిని కూడా కలుపుకుంటున్నారు. రేపు యూకే పార్లమెంటు వెలుపల వారంతా కలిసి తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు.

ఈ అత్యున్నత నైపుణ్యమున్న వలస జాతీయుల (హైలీ స్కిల్డ్ మైగ్రాంట్స్-హెచ్‌ఎస్‌ఎం) బృందంలో సుమారు వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వారిలో యూరోపియన్ యూనియన్ ‌(ఈయూ) వెలుపల ఉండే దేశాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, టీచర్లు ఉన్నారు. నిరసన కార్యక్రమంలో దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన నిపుణులను కూడా హెచ్ఎస్ఎం కలుపుకుపోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారిలో ప్రధానంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

బ్రిటన్‌లో శాశ్వత నివాసం (ఇన్‌డిఫినిట్ లీవ్ టు రిమైన్-ఐఎల్ఆర్) కోసం పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో జాప్యాలతో పాటు వాటిని నిర్హేతుకంగా తిరస్కరించడానికి వ్యతిరేకంగా వృత్తి నిపుణులు, వారి కుటుంబాలు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. గతనెల డౌనింగ్ స్ట్రీట్‌ (ప్రధాని అధికారిక నివాసం) వెలుపల నిరసన చేపట్టిన ఈ గ్రూపు నిర్వాహకుల్లో ఒకరైన అదితి భరద్వాజ్ మాట్లాడుతూ, సహేతుకమైన కారణాలు చూపకుండా యూకేలో ఉంటూ పనిచేసుకునే హక్కును ప్రభుత్వం తిరస్కరిస్తున్నందు వల్ల తమ ర్యాలీకి మరింత మంది మద్దతు తెలుపుతున్నారని ఆమె చెప్పారు. కొన్నేళ్ల కిందట టైర్ 1 (జనరల్) వీసా కింద యూకేలో అడుగుపెట్టిన వృత్తి నిపుణులు ఆ దేశంలో ఐదేళ్ల పాటు చట్టబద్ధంగా నివసిస్తే శాశ్వత నివాస హోదా పొందడానికి వారు అర్హులు.

అయితే నేరస్థులు, పన్ను ఎగవేతదారులకు ఉద్దేశించిన యూకే వలస చట్టంలోని ఓ సెక్షన్ కింద తమ దరఖాస్తుల పరిశీలన, ఆమోదాల విషయంలో అధికారులు జాప్యం చేయడం లేదా తిరస్కరించడం లాంటివి చేస్తున్నారని హెచ్ఎస్ఎం ఆరోపిస్తోంది. కాగా, యూకే 6 ద్వారా తమ దరఖాస్తులను ఆరు నెలల్లోగా పరిశీలించి పరిష్కరించాలని బ్రిటన్ ప్రధాని థెరీస్సా మే, హోం శాఖ మంత్రి అంబర్ రుద్, విపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌లను అదితి ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరలోనే అన్ని వీసా దరఖాస్తుల సమస్యలను పరిష్కరిస్తామని యూకే హోం శాఖ కార్యాలయం హామీ ఇవ్వడం గమనార్హం.

More Telugu News