Narendra Modi: నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తారన్న భయంతో కాన్ఫరెన్స్ ను వాయిదా వేసిన కేంద్రం!

  • 26 నుంచి రెండు రోజుల పాటు జరగాల్సిన లేబర్ కాన్ఫరెన్స్
  • ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించాలన్న యోచనలో ట్రేడ్ యూనియన్లు
  • నిఘా వర్గాల సమాచారంతో సదస్సు వాయిదా

ఇండియాలో ఉద్యోగ సృష్టి, కార్మికులకు సాంఘిక భద్రతపై ఈనెల 26 నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరగాల్సిన 47వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సదస్సును వాయిదా వేస్తున్నట్టు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనుండగా, ఆయన ప్రసంగాన్ని ట్రేడ్ యూనియన్లు బహిష్కరించే ఆలోచనలో ఉన్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ట్రేడ్ యూనియన్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తే, కేంద్రానికి ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయన్న ఆలోచనతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సదస్సు వాయిదా పడిందన్న విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఓ ప్రకటనలో తెలుపుతూ, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్టు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లూ సదస్సుకు హాజరు కానుండగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ తో పాటు పలు సంఘాలు మోదీని బహిష్కరించాలని ప్రణాళికలు వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయని సమాచారం. 2018-19 వార్షిక బడ్జెట్ లో కార్మికుల అవసరాలను తీర్చేలా ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేదని ఇటీవల ట్రేడ్ యూనియన్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఈ సదస్సును వ్యతిరేకిస్తామని, భారీ ప్రదర్శన నిర్వహిస్తామని రెండు రోజుల క్రితం బీఎంఎస్ కార్యదర్శి వీర్జేష్ ఉపాధ్యాయ హెచ్చరించారు. ఇదే సమయంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సైతం లేబర్ కాన్ఫరెన్స్ లో తమ డిమాండ్లపై నిలదీస్తామని హెచ్చరించాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సదస్సును వాయిదా వేసినట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News