Telugudesam: మా జగన్ ఎప్పుడు సవాల్ చేశారు?... మీరేం స్వీకరించారు?: పవన్ పై బొత్స ఫైర్

  • టీడీపీని ఒప్పించేందుకు సాయపడాలని మాత్రమే జగన్ కోరారు
  • దాన్నే సవాల్ గా తీసుకుని పవన్ ప్రతి సవాళ్లు
  • ఓ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్నాం
  • మీడియాతో బొత్స సత్యనారాయణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తననేదో సవాల్ చేశారని చెబుతూ, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ దాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పడం ఏంటని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఎటువంటి సవాల్ నూ చేయలేదని, చంద్రబాబు పార్టనర్ గా ఉన్న పవన్ కల్యాణ్, అవిశ్వాసం కోసం వారిని ఒప్పించాలని మాత్రమే కోరారని, రాష్ట్ర హక్కుల సాధన కోసం సలహాలు ఇవ్వాలని అడిగారని, దాన్నే సవాల్ అంటూ, ప్రతి సవాళ్లు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

జగన్ ఎక్కడా సవాళ్లు చేయలేదని, 'మీ పార్టనర్ ను ఒప్పించండి' అన్నందుకు మీకేమైనా బాధేసిందా? అని బొత్స అడిగారు. నిన్న పవన్ చిన్న పిల్లాడిలా మాట్లాడారని, నాలుగో తారీఖే అవిశ్వాసం పెట్టమని డిమాండ్ చేయడం ఏంటని అడిగారు. తమ పార్టీ ఓ షెడ్యూల్ ను ముందుగానే నిర్ణయించుకుందని, దాని ప్రకారం ముందుకు సాగుతామని తెలిపారు. దాన్ని కాదని ఇవాళే పెట్టండి, రేపు పెట్టండి అంటూ చైల్డిష్ గా పవన్ ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని అన్నారు.

అవిశ్వాసం ఎప్పుడు పెట్టడానికైనా తమకు అభ్యంతరం లేదని, తమకు ఐదుగురు ఎంపీలే ఉన్నారని, వారితో అవిశ్వాసం పెట్టడం కుదరదని, మిగతావారి మద్దతు పొందిన తరువాత ముందడుగు వేస్తామని, ఏపీకి ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. 

More Telugu News