Chandrayaan-2 mission: 'చంద్రయాన్ 2' బడ్జెట్ హాలీవుడ్ సినిమా 'ఇంటర్‌స్టెల్లార్' కంటే తక్కువే!

  • హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్టులోనే ఇస్రో ప్రయోగాలు 
  • 'గ్రావిటీ' కంటే మామ్ ప్రయోగం కూడా చీపే
  • వ్యవస్థల సూక్ష్మీకరణతోనే పొదుపు సాధ్యమంటోన్న ఇస్రో

దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో భారత్ త్వరలో చేపట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగం 2014లో రిలీజైన హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ఇంటర్‌స్టెల్లార్' కంటే చవకే. 'ఇంటర్‌స్టెల్లార్' సినిమా బడ్జెట్ అక్షరాలా రూ.1,062 కోట్లు (165 మిలియన్ డాలర్లు). నిజానికి 2013లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అరుణ గ్రహంపైకి ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) బడ్జెట్ రూ.470 కోట్లు. ఇది మరో హాలీవుడ్ చిత్రం 'గ్రావిటీ' (రూ.644 కోట్లు లేదా 100 మిలియన్ డాలర్లు) వ్యయంతో పోల్చితే కూడా తక్కువే.

అసలు ఇస్రో ఇంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలను ఎలా చేపడుతుందనే డౌటు మనకు రావొచ్చు. అందుకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ వివరణ ఇస్తున్నారు. ప్రయోగాలకు ఉద్దేశించిన సాంకేతిక వ్యవస్థలను సూక్ష్మీకరించడం, రాజీలేని నాణ్యతా నియంత్రణ పద్ధతులను పాటించడం, ఓ వస్తువు నుండి సాధ్యమైనంత ఎక్కువ ఫలితాన్ని రాబట్టడం లాంటి కారణాల వల్ల తమ ప్రయోగాలను మరింత చౌకగానూ, మితవ్యయంతోనూ నిర్వహించగల్గుతున్నామని ఆయన వివరించారు.

ఏదైనా అంతరిక్ష వాహకనౌక లేదా రాకెట్‌ను అభివృద్ధి చేసేటపుడు దానికి సంబంధించి ప్రతి దశ అభివద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన చెప్పారు. అందువల్ల వృథా ఖర్చుకు ఆస్కారం ఉండదని, ఫలితంగా ప్రయోగాల వ్యయం తగ్గుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టే అవకాశముంది. అయితే భూమితో చంద్రుడి సాపేక్ష స్థితి లాంటి వివిధ రకాల అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రయోగానికి కచ్చితమైన తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

More Telugu News