Nirav Modi: నీరవ్ మోదీ ఆచూకీ దొరికింది.. అరెస్ట్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు!

  • దుబాయ్‌కు చెక్కేసిన నీరవ్ మోదీ
  • భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వ యత్నాలు
  • అదంత ఈజీ కాదంటున్న నిపుణులు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ని నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ దుబాయ్‌లో ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఆయనను వెనక్కి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, అదంత సులువైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. దేశం విడిచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న నిందితులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం మొత్తం 47 దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, 9 దేశాలతో సర్దుబాట్లు చేసుకుంది.

1962 నాటి నేరగాళ్ల అప్పగింత చట్టం ప్రకారం నిందితుడు విదేశాల్లో ఉంటే అక్కడే లొంగిపోవడానికి, లేదంటే అరెస్ట్ చేయడానికి అక్కడి ప్రభుత్వానికి మన ప్రభుత్వం విజ్ఞప్తి చేయవచ్చు. అయితే నిందితుడి నేరాన్ని రెండు దేశాల్లోనూ నేరంగానే పరిగణిస్తే తప్ప అది సాధ్యం కాదు. బ్రిటన్ వంటి కొన్ని దేశాలు నేరస్తులను అంత సులభంగా అప్పగించేందుకు ముందుకు రావు.

భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడిని అప్పగించాలన్న భారత్ అభ్యర్థనలు బేఖాతరు అవుతున్నాయి.  నిందితుడికి పడబోయే శిక్ష తమ దేశంలో అమల్లో లేకున్నా ఆ దేశం నిందితుడిని అప్పగించకపోవచ్చు. దీంతో, ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నట్టు చెబుతున్న నీరవ్ మోదీని భారత్‌కు ఎలా రప్పించాలన్న దానిపై ప్రభుత్వం, దర్యాప్తు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు, దుబాయ్‌లో ఉన్న నీరవ్ మోదీని కలిసేందుకు ఆయన తరపు న్యాయబృందం ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News